బోలెడు పడకలు ఖాళీ!

12 Nov, 2020 03:34 IST|Sakshi

తగ్గుతున్న కరోనా కేసులు 

ఆస్పత్రుల సంఖ్య 248 నుంచి 169కి తగ్గుముఖం 

సాధారణ పడకలూ వేలల్లో ఖాళీ

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుతోంది. ఈ విషయాన్ని ఖాళీగా ఉన్న పడకలే రుజువు చేస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు సగటున 40 వేల పడకల్లో కరోనా బాధితులుండేవారు. ఇప్పుడు వాటి సంఖ్య ఐదు వేలకు పడిపోయింది. మరోవైపు కరోనా ఆస్పత్రుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. మొన్నటి దాకా ప్రభుత్వ, ప్రయివేటులో కలిపి 248 ఆస్పత్రులను కోవిడ్‌ సేవల కోసమే వినియోగించగా, ఇప్పుడా ఆస్పత్రుల సంఖ్యను 169కి తగ్గించారు. మరోవైపు మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. ఒక దశలో రోజుకు 90 మంది కూడా మరణించిన రోజులున్నాయి. ప్రస్తుతం మరణాలు 10కి తగ్గింది.

కేసులే కాదు.. తీవ్రతా తగ్గింది!
కేసులు తగ్గుముఖం పట్టడమే కాదు తీవ్రత కూడా తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. కేవలం కోవిడ్‌ కేర్‌ సెంటర్లలోనే 16,134 పడకలుండగా, 1,882 పడకల్లో మాత్రమే బాధితులున్నారు. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో కోవిడ్‌ చికిత్సకు కేవలం నాలుగు ఆస్పత్రులే ఉన్నాయి. వెంటిలేటర్‌పై చికిత్స అందించాల్సిన కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. అన్‌స్టేబుల్‌.. అంటే కరోనాతో విషమ పరిస్థితుల్లో ఉన్న వారి సంఖ్య జీరోగా ఉంది. పడకలు లేదా చికిత్సకు సంబంధించి 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయగానే బాధితులకు తక్షణమే సాయం, వారు అడిగిన వివరాలు అందిస్తున్నారు. ఎక్కువ మంది బాధితులు వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రులవైపే మొగ్గుచూపుతున్నారు.

అయినా అప్రమత్తంగా ఉండాల్సిందే..
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడటం, భౌతిక దూరం వంటివి పాటించాల్సిందే. వీటిపై ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. కరోనా తగ్గిందని ఎవరూ అజాగ్రత్తగా ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. 
– ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, వైద్యారోగ్య శాఖ మంత్రి   

మరిన్ని వార్తలు