తగ్గుతున్న మాతృ మరణాలు

14 Dec, 2020 03:56 IST|Sakshi

దేశంలో జాతీయ సగటున 113 మంది తల్లులు మృతి

అత్యధికంగా అస్సాంలో లక్ష మందికి 215 మాతృ మరణాలు

ఏపీలో లక్షకు 65 కాగా.. కేరళలో అత్యల్పంగా 43 మంది

తాజాగా ఎస్‌ఆర్‌ఎస్‌స్పెషల్‌ బులెటిన్‌ వెల్లడి

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా మాతృ మరణాలు (ప్రసవ సమయంలో తల్లుల మృతి) గణనీయంగా తగ్గుతున్నాయి. సహస్రాబ్ధి లక్ష్యాల్లో భాగంగా జాతీయ స్థాయిలో లక్ష ప్రసవాలకు తల్లుల మృతుల సంఖ్యను 70కి తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించారు. తాజాగా ఎస్‌ఆర్‌ఎస్‌ (శాంపిల్‌ రిజిస్ట్రేషన్‌ సర్వే) స్పెషల్‌ బులెటిన్‌లో జాతీయ సగటున ప్రతి లక్ష ప్రసవాలకు 113 మంది తల్లులు మృతి చెందుతున్నట్టు వెల్లడైంది. అయితే జాతీయ సగటు కంటే చాలా రాష్ట్రాల్లో ఈ సంఖ్య ఎక్కువగా ఉండడం  కలవరపెడుతోంది. అస్సాం, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ భారీగా మాతృ మరణాలు సంభవిస్తున్నాయి. 2016–18కి గానూ విడుదల చేసిన  ప్రత్యేక బులెటిన్‌లో లక్ష ప్రసవాలకు ఏపీలో 65 మాతృ మరణాలు సంభవిస్తున్నట్టు వెల్లడైంది.

మాతృ మరణాలకు ప్రధాన కారణాలు ఇవే..
► ప్రసవానంతరం అధిక రక్తస్రావంతో 38 శాతం మంది..
► సెప్సిస్‌ (ప్రసవ సమయంలో విషపూరితం కావడం) కారణంగా
► శాతం మంది..  అధిక రక్తపోటు (హైపర్‌ టెన్షన్‌) వల్ల 5 శాతం మంది..
► అబార్షన్లు జరగడం వల్ల 8 శాతం మంది..
► రకరకాల గర్భకోశ వ్యాధుల వల్ల 5గురు.. 
► ఇతర కారణాల వల్ల 34 శాతం మంది మృత్యువాత పడుతున్నారు.

ఏపీలో తల్లులకు భరోసా ఇలా..
► ప్రతి నెలా 9వ తేదీన గర్భిణులకు వైద్య పరీక్షలు నిర్వహించి హైరిస్కు గర్భిణులను గుర్తించి, ప్రత్యేకంగా ఓ ఆశ కార్యకర్త లేదా ఒక ఏఎన్‌ఎంను నియమించడం
► ప్రతి పీహెచ్‌సీలోనూ సేఫ్‌ డెలివరీ కేలండర్‌ ఏర్పాటు చేయడం. ఆరు రోజుల ముందే వారిని ఆస్పత్రిలో చేర్పించడం
► 108 డ్రైవరు నంబరు ఆమెకు ఇవ్వడం..డ్రైవరుకు గర్భిణి నంబరు ఇచ్చి ఫోన్‌ చేసి మరీ తీసుకురావడం
► ఎంఎస్‌ఎస్‌ యాప్‌ ద్వారా ప్రతి పీహెచ్‌సీ పరిధిలోనూ హైరిస్కు గర్భిణులను గుర్తించి వారికి సుఖప్రసవాలు అయ్యేలా చేయడం
► ప్రతి 15 రోజులకు ఒకసారి మాతృ మరణాలపై కలెక్టర్ల స్థాయి సమీక్ష నిర్వహించడం

గణనీయంగా తగ్గించేందుకు కృషి 
ఆంధ్రప్రదేశ్‌లో మాతృ మరణాలను 74 నుంచి 65కు తగ్గించాం. ఈ సంఖ్య మరింతగా తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మాతృ మరణాలు తగ్గడం మంచి పరిణామం.  
– డా. గీతాప్రసాదిని, ప్రజారోగ్య సంచాలకులు 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు