14 రోజుల్లో 46.6 టీఎంసీలు

2 Aug, 2020 04:02 IST|Sakshi

విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు భారీగా నీటిని తరలిస్తున్న తెలంగాణ

శ్రీశైలంలో తగ్గుతున్న నీటి మట్టం

ఇలాగైతే రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందవు

సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు ఆదేశాలను తెలంగాణ సర్కార్‌ బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో ఆరు యూనిట్ల ద్వారా యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇలా 14 రోజుల్లో మొత్తం 46.60 టీఎంసీల నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తరలించింది. నీటి మట్టం తగ్గిపోతుండడంవల్ల పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ (పీహెచ్‌ఆర్‌) ద్వారా రాయలసీమ, నెల్లూరు ప్రాజెక్టులకు నీళ్లందని దుస్థితి నెలకొంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ సర్కార్‌ను ఆదేశించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు రెండుసార్లు లేఖలు రాసింది. కానీ.. విద్యుదుత్పత్తి నిలిపేసేలా చర్యలు తీసుకోవడంలో బోర్డు విఫలమైంది. ఏటా ఇదే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వాటా నీటిని సమర్థవంతంగా వినియోగించుకుని రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసమే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని కృష్ణా బోర్డుకు మరోసారి తేల్చిచెప్పాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అందుకే రాయలసీమ ఎత్తిపోతల..
► అవసరం ఉన్నా లేకపోయినా తెలంగాణ జెన్‌కో అధికారులు ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తున్నారు. దీనివల్ల శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులను మెయింటెయిన్‌ చేయడం కష్టంగా మారుతోంది.
► ఎడమ గట్టు విద్యుత్కేంద్రం, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ద్వారా 800 అడుగుల నుంచే తెలంగాణ నీటిని తరలించడంవల్ల శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోతోంది. కృష్ణా బోర్డు కేటాయింపులున్నా సరే వాటిని వినియోగించుకునే అవకాశం రాయలసీమ ప్రాజెక్టులకు లేకుండా పోతోంది. రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన వాటా జలాలను వినియోగించుకోవడానికి.. రాయలసీమ, నెల్లూరు జిల్లాల దాహార్తి తీర్చడానికే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామనే అంశాన్ని మరోసారి కృష్ణా బోర్డుకు స్పష్టంచేయడానికి ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు.

శ్రీశైలంలో తగ్గిన నీటి మట్టం 
జూరాల ప్రాజెక్టు విద్యుత్‌ కేంద్రం నుంచి దిగువకు వదులుతున్న నీటితోపాటు తుంగభద్ర, హంద్రీ నదుల వరద జలాలు కలవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం 35,679 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో 900 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ దిగువకు 42,000 క్యూసెక్కులకు పైగా తరలిస్తున్నారు. ప్రాజెక్టులోకి వచ్చే ప్రవాహం కంటే.. దిగువకు అధికంగా వదిలేస్తుండటం వల్ల నీటి మట్టం తగ్గిపోతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 852.50 అడుగుల్లో 85.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు