భవితతో చెలగాటం.. ‘డీఈడీ’ బాగోతం

17 Sep, 2020 11:10 IST|Sakshi

నిబంధనలు తుంగలో తొక్కిన డీఈడీ కాలేజీలు 

గత ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అనుమతులు 

ఈనెల 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు పరీక్షలు 

అయోమయంలో 1800 మంది భవితవ్యం  

విచారణకు ఆదేశించిన విద్యాశాఖ 

గత ప్రభుత్వం విద్యను అక్రమాల పుట్టగా మార్చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీనే కాదు, ఉపాధ్యాయ విద్య (డీఈడీ)ని సైతం గందరగోళం చేసింది. ఉపాధ్యాయ నియామకాల డీఎస్సీని వివాదాలమయం చేసింది. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ విద్యను కూడా వ్యాపారమయం చేసింది. జిల్లాలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈడీ) కళాశాలలు డీసెట్‌–2018 మార్గదర్శకాలకు సంబంధం లేకుండానే ప్రవేశాలు కల్పించి ఇప్పుడు ఏకంగా 1800 మంది  విద్యార్థుల భవితవ్యాన్ని ఆందోళనలోకి నెట్టారు. మొత్తం మీద ఈ సెప్టెంబర్‌ 28 నుంచి డీఈడీ అభ్యర్థులకు నిర్వహించనున్న పరీక్షలకు అవకాశం లేకుండా చేశారు.

సాక్షి, ఒంగోలు మెట్రో: ఉపాధ్యాయ నియామకాలు డీఎస్సీ ద్వారా జరుగుతుండటంతో డీఈడీ కోర్సుకు డిమాండ్‌ పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ప్రకాశంలో 139 ప్రవేటు డైట్‌ కాలేజీలు ఏర్పాటయ్యాయి. వీటిల్లో కొన్ని కాలేజీల యాజమాన్యాలు లిక్కర్‌ కాంట్రాక్టర్లు కావటం గమనార్హం. డీఈడీ రెండేళ్ల టీచర్‌ ట్రెయినింగ్‌ కోర్సులో చేరాలంటే ముందుగా డీసెట్‌ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఉత్తీర్ణత ద్వారా డీఈడీ కాలేజీలో ప్రవేశం కల్పిస్తారు. కానీ, గత ప్రభుత్వం డీసెట్‌ రాయకుండానే ప్రవేశాలు కల్పించుకోవచ్చనే అడ్డగోలు అనుమతులు ఇచ్చింది. దీంతో జిల్లాలోని పలు కాలేజీల యాజమాన్యాలు డీసెట్‌ రాయకుండానే డీఈడీ ప్రవేశాలను వ్యాపారమయం చేసేశాయి. ఒక్కో సీటుకు 50 వేల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తూ సీట్లను విక్రయించారు. ఇలా డీసెట్‌ నిబంధనలు తుంగలో తొక్కి ప్రవేశాలు కల్పించిన విషయాన్ని గుర్తించిన విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు జిల్లాలోని డైట్‌ కళాశాలల అక్రమ ప్రవేశాల మీద నివేదిక ఇవ్వాల్సిందిగా డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వెంకటేశ్వరరావును ఆదేశించారు.  

డీసెట్‌తో పని లేకుండానే సీట్ల భర్తీ.. 
జిల్లాలో మొత్తం 140 ప్రవేటు డీఈడీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో మైనంపాడు డైట్‌ కళాశాల ఒక్కటే ప్రభుత్వ కళాశాల. మిగిలిన 139 కళాశాలలు ప్రవేటువే కాగా, ఉపాధ్యాయ విద్య పెద్ద ఎత్తున బిజినెస్‌గా మార్చటంలో జిల్లాలోని పలు యాజమాన్యాలు కాకలు తీరాయి. 2015లో విడుదల చేసిన జీవో నంబర్‌ 30 ప్రకారం డీసెట్‌ పరీక్ష ద్వారానే ఆయా కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. డీసెట్‌ కన్వీనర్‌ కోటా ద్వారా 80 శాతం 20 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా ద్వారా సీట్లు భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, డీసెట్‌తో సంబంధం లేకుండానే ఏకంగా అన్ని సీట్లూ మేనేజ్‌మెంట్‌ కోటాలో భర్తీ చేసుకుని సొమ్ము చేసుకోవటం, ఆనక విద్యార్థులతో కేసులు వేయించి అనుమతులు తెచ్చుకోవటం పరిపాటిగా మారిపోయింది.

ఈ విధంగా 2017 విద్యా సంవత్సరంలో జరిగింది కనుక 2018 విద్యా సంవత్సరంలతో కూడా డీసెట్‌ అర్హత లేకుండానే యాజమాన్యాలు ఇదేవిధంగా ప్రవేశాలు కల్పించారు. ఇలా ఒంగోలు, దర్శి, గిద్దలూరు, మార్కాపురం ప్రాంతాల్లోని డీఈడీ కాలేజీల్లో 200 మంది చొప్పున విద్యార్థులు ఉన్నారు. మిగిలిన కళాశాలల్లో 50 మంది వరకు ఉన్నారు. ఇలా అన్ని కాలేజీల నుంచి డీసెట్‌తో సంబంధం లేకుండా మొత్తం 1800 మంది వరకు విద్యార్థులు డీసెట్‌తో సంబంధం లేకుండా ప్రవేశాలు కల్పించారు. వీరి ద్వారా యాజమాన్యాలు కోర్టులో కేసు వేయించాయి. దీంతో విద్యాశాఖ స్పందించి విచారణకు ఆదేశించింది. 

వారంలోపు నివేదిక పంపిస్తాం.. 
నిబంధనలు పాటించకుండా ప్రవేశాలు కల్పించిన కాలేజీల వివరాలు సేకరిస్తున్నాం. ఏయే కాలేజీల్లో ఎన్నెన్ని సీట్లు భర్తీ చేశారో తెలుసుకుని సంపూర్ణ నివేదికను పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు అందజేస్తాం. 
– వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్, మైనంపాడు డైట్‌ కళాశాల  

>
మరిన్ని వార్తలు