తిరుమ‌లలో శాస్త్రోక్తంగా దీపావళి ఆస్థానం

14 Nov, 2020 11:12 IST|Sakshi

సాక్షి, తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను బంగారు వాకిలి చెంత నిర్వహించారు.   శ్రీ మలయప్పస్వామి, అమ్మవార్ల, విష్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాళ్వారు సన్నిధిలో అభిముఖంగా ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. నూతన పట్టు వస్త్ర సమర్పణను మూలవిరాట్టు, దేవతా ఉత్సవమూర్తులకు ధరింపజేసి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. దీనితో దీపావళి ఆస్థానం పూర్తయింది. అనంతరం తీర్థ, శఠారి మర్యాదలతో ఆలయ అధికారులను అర్చకులు ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో భారత సైనికుల ప్రాణాలు తీస్తున్న శత్రువులను, ప్రపంచాన్ని భాధిస్తున్న కరోనా వ్యాధిని సంహరించాలని శ్రీ వేంకటేశ్వర స్వామిని, అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. దేశరక్షణకు సరిహద్దుల్లో మన సైనికులు చేస్తున్న వీరోచిత పోరాటం అభినందనీయమన్నారు.  కరోనా నుంచి ప్రపంచాన్ని స్వామి వారు తప్పకుండా కాపాడతారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతియేటాలాగే ఈ సారి కూడా శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్ర బద్దంగా నిర్వహించామని చెప్పారు.  తెలుగు ప్రజలకు వైవి సుబ్బారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.  అంతకు ముందు  శ్రీవారి ఆలయంలో నిర్వహించిన దీపావళి ఆస్థానంలో వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు