ఏలూరులో కొనసాగుతున్న ఎయిమ్స్‌ బృందం పర్యటన

9 Dec, 2020 16:55 IST|Sakshi

శాంపిల్స్‌ సేకరణ..పెరుగుతున్న డిశ్చార్జ్‌లు

సాక్షి, పశ్చిమ గోదావరి : ఏలూరులోని దక్షిణపు వీధిలో ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం పర్యటన కొనసాగుతోంది. వ్యాధి బారినపడి ఇప్పటికే డిశ్చార్జి అయి ఇంటి వద్ద ఉన్న బాధితుల వివరాలను వైద్యుల బృందం అడిగి తెలుసుకుంది. త్రాగునీటి శాంపిల్స్‌తో పాటు బాధితుల రక్త నమూనాలను కేంద్ర బృందం సేకరిస్తుంది. మరోవైపు వింత లక్షణాలతో అస్వస్థతకు గురైన వారిలో 22 మందిని ఏలూరు వైద్యులు  విజయవాడకు పంపారు. వారిని ప్రత్యేక వార్డులో పెట్టి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్‌ అనంతరం ఇద్దరిని డిశ్చార్జ్‌ చేశారు. మిగతావారి  ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, అందరూ కోలుకుంటున్నట్లు జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి సుహాసిని  తెలిపారు.

విజయవాడకు వచ్చిన వారిలో రెండోసారి వ్యాధి లక్షణాలు కనిపించలేదని, భయం, మానసిక ఒత్తిడి వల్ల కొంతమంది ఇబ్బందికి గురయ్యారని పేర్కొన్నారు. ఈ అంశంపై మానసిక వైద్యనిపుణులు కూడా కేస్ స్టడీ చేస్తున్నట్లు వివరించారు. 24 గంటలపాటు వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అస్వస్థతకు గురైన వారి బ్లడ్ ,యూరిన్ ,స్పైనల్ శాంపిల్స్ పరీక్షలకు పంపామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. (ఏలూరు: అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ )

మరిన్ని వార్తలు