‘పోలవరం జాతీయ ప్రాజెక్ట్‌.. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు చేయడానికి వీల్లేదు’

19 Jul, 2022 14:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పంపిన ఫిషింగ్ హార్బర్‌ల ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వంగా గీత కోరారు. ఈ మేరకు రెండో రోజు పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా ఎంపీ వంగా గీత మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు కేంద్రానికి పంపామని తెలిపారు. 

అన్నవరం నుంచి జీఎంఆర్ఎస్ఈజడ్ వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న అంశాలతో పాటు ఇతర అభివృద్దికి కేంద్రం సహకరించాలని కోరారు. మహారాష్ట్రలో భారీ వర్షాల వల్లే గోదావరికి వరదలు వచ్చాయని ఎంపీ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంచడం వల్ల భద్రాచాలం మునిగిందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు.

బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం
పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందని వైఎస్సార్‌ సీపీ రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టని, కేంద్రం నిధులు సమకూరుస్తోందని పేర్కొన్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదని, డిజైన్‌లలో కరెక్షన్లపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు.

రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే అత్యంత ముఖ్యమని, జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతుందన్న ఎంపీ.. రాష్ట్ర ప్రభుత్వం 10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కావాల్సిన అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నాంమని, ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని పేర్కొన్నారు.

రామాయపట్నం పోర్ట్‌ శంకుస్థాపన
రామాయపట్నం పోర్ట్‌ పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నట్లు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతో ఈ పోర్ట్ నిర్మిస్తోందన్నారు. రామాయపట్నం పోర్టును కేంద్రమే నిర్మించాలని కోరినట్లు గుర్తు చేశారు. అయిదు వేల కోట్ల రూపాయలతో పోర్ట్ నిర్మాణం జరగనుందన్నారు. ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని, దీని వల్ల నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల అభివృద్ధి జరుగుతందని ఆశాభావం వ్యక్తం చేశారు.  మచిలీపట్నం పోర్ట్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు