ఆక్సిజన్‌ పంపిణీ: ఆపద్బాంధవి ఆంధ్రా

22 Apr, 2021 04:44 IST|Sakshi
స్టీల్‌ ప్లాంట్‌లోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ వద్ద ట్యాంకర్లలోకి లోడ్‌ చేస్తున్న దృశ్యం

రోజుకు 100 టన్నుల ఆక్సిజన్‌ పంపిణీ

వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు వారం రోజుల్లో 700 టన్నుల సరఫరా

మహారాష్ట్రకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ ద్వారా 10 ట్యాంకర్లతో 150 టన్నులు పంపించేందుకు ఏర్పాట్లు

సాక్షి, విశాఖపట్నం: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న వేళ ఆక్సిజన్‌ అత్యవసరంగా మారింది. రాష్ట్రంలో ఆక్సిజన్‌ అవసరమైన కోవిడ్‌ బాధితులకు పూర్తి స్థాయిలో అందించడంతోపాటు వివిధ రాష్ట్రాలకు సైతం ఏపీ ప్రభుత్వం సాయమందిస్తోంది. విశాఖ కేంద్రంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పలు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సరఫరా చేస్తోంది. ఆక్సిజన్‌ తయారీలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ముఖ్యభూమిక పోషిస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌లో నిత్యం లిక్విడ్‌ ఆక్సిజన్‌ తయారు చేస్తుంటారు. ఈ ప్లాంట్‌లో మొత్తం 5 ఆక్సిజన్‌ ప్లాంట్స్‌ ద్వారా రోజుకు గరిష్టంగా 2,950 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది.

గత ఏడాది సుమారు 8,842 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసి వందలాది మంది ప్రాణాలను స్టీల్‌ ప్లాంట్‌ కాపాడింది. ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌లో అదే పరిస్థితులు కొనసాగుతుండటంతో స్టీల్‌ ప్లాంట్‌తో రాష్ట్ర డ్రగ్‌ కంట్రోల్‌ అధికారులు సంప్రదింపులు జరిపారు. ఉక్కు ఉత్పత్తికి అవసరమైన ఆక్సిజన్‌ని వినియోగించుకుని మిగిలిన ఆక్సిజన్‌ను వైద్య అవసరాల కోసం ఇవ్వాలని కోరగా.. స్టీల్‌ప్లాంట్‌ నుంచి వారం రోజులుగా సరఫరా ప్రారంభించారు. రోజుకు 100 టన్నుల చొప్పున వారం రోజుల్లో 700 టన్నులకు పైగా ఆక్సిజన్‌ను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు పంపించారు. మహారాష్ట్రకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ద్వారా గురువారం 10 ట్యాంకర్ల ద్వారా 150 టన్నులు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు స్టీల్‌ప్లాంట్‌ అధికారులు తెలిపారు. 

50 మెట్రిక్‌ టన్నుల వినియోగం
ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ కేంద్రాల్లో రోజుకు 200 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం 50 నుంచి 60 మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 50 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కోవిడ్‌ పేషెంట్లకు అవసరమవుతోంది. ఈ నెల 25 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 7,380 ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేయాలని, అందుకు అనుగుణంగా ఆక్సిజన్‌ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యారోగ్య శాఖ అధికారుల్ని ఆదేశించారు. దీంతో అన్ని ప్రాంతాలకు అవసరమైన మేర పంపించేలా ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యం పెంచాలని ఆయా కేంద్రాలకు డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉత్పత్తికి సరిపడా నిల్వ సామర్థ్యం రాష్ట్రంలో ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిల్వ చేసుకునే వీలుందని అధికారులు చెబుతున్నారు. ఆక్సిజన్‌ ట్యాంకర్లు పంపించాలని వివిధ రాష్ట్రాలు ఏపీ ప్రభుత్వాన్ని సాయం కోరగా.. విశాఖలో ఉన్న ట్యాంకర్లను పంపించాలని నిర్ణయించింది. ప్రస్తుతం మహారాష్ట్రకు వీటిని పంపిస్తున్నట్టు కలెక్టర్‌ వినయ్‌ చంద్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు