చేపల్లో మహా‘రాణి’లు!.. లొట్టలేసుకుని తింటారు.. ఎందుకంత డిమాండ్‌?

1 Feb, 2023 17:22 IST|Sakshi
రాణి ఫిష్‌ (గులివిందలు)  

సాక్షి, విశాఖపట్నం: ఒకప్పుడు అంతగా డిమాండ్‌ లేని రాణి ఫిష్‌ చేపలకు ఇప్పుడు మంచి రోజులొచ్చాయి. స్థానిక మార్కెట్లో గులివిందలుగా పిలిచే ఈ చేపలు అధిక డిమాండ్, ధరలతో కొన్నాళ్లుగా మహారాణులయ్యాయి. మత్స్యకారులకు కాస్త ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. లేత ఎరుపు, పసుపు, తెలుపు, బంగారు, నీలి రంగుల చారలతో కంటికి ఒకింత ఇంపుగా కనిపించే ఈ చేపలకు చెన్నై, కేరళ రాష్ట్రాల్లో లొట్టలేసుకుని తింటారు.

అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతంలో లభించే ఈ చేపలకు రుచి ఎక్కువ. అందువల్ల తమిళనాడు, కేరళ ప్రాంతాల ప్రజలు వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. ఒడిశాలోని చిలక ప్రాంతం నుంచి మన రాష్ట్రంలోని కాకినాడ వరకు వీటి లభ్యత అధికంగా ఉంటుంది. నవంబరు నుంచి ఏప్రిల్‌ వరకు మత్స్యకారులకు సముద్రంలో ఇవి పెద్ద సంఖ్యలో లభ్యమవుతాయి.

గతంలో చెన్నై, కేరళల నుంచి వర్తకులు విశాఖపట్నం వచ్చి వీటిని కొనుగోలు చేసి తమ ప్రాంతాలకు ఎగుమతి చేసుకునే వారు. అప్పట్లో ఇక్కడ కిలో రూ.50కి మించి కొనుగోలు చేసే వారు కాదు. అక్కడ కిలో రూ.100కు పైగా విక్రయించుకునే వారు. పైగా ఈ ప్రాంతంలో వీటికి అంతంతమాత్రపు ధరే లభించేది. కానీ కొన్నాళ్లుగా వీటికి మహా రాణి యోగం పట్టింది. కొంతమంది స్థానిక వర్తకులు ఈ రాణి చేపలను ఇక్కడ నుంచి నేరుగా చెన్నై, కేరళలకు ఎగుమతులు చేస్తున్నారు.

అక్కడ కిలో రూ.130 వరకు అమ్ముతున్నారు. దీంతో ఇక్కడ రాణి ఫిష్‌కు అనూహ్యంగా మంచి ధర లభిస్తోంది. ఇలా ప్రస్తుతం వీటిని ట్రేడర్లు కిలో రూ.100 వరకు కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పెద్ద సైజు రాణి ఫిష్‌ను కిలో రూ.200 ధర కూడా పలుకుతోంది. ఇలా గతంలో అక్కడ అమ్మకం చేసే ధరే దాదాపు ఇక్కడ వస్తోంది.
చదవండి: మదనపల్లెలో కశ్మీరీ కుంకుమపువ్వు

అసలే వేట గిట్టుబాటు కాక సతమతమవుతున్న మత్స్యకారులు, బోటు యజమానులకు గులివిందల ధర లాభదాయకంగా ఉంటోంది. ఇది మత్స్యకారులకు ఊరటనిస్తోంది. ‘డీజిల్‌ ధర కొన్నాళ్లుగా మాకు పెను భారంగా మారింది. ఈ తరుణంలో సమృద్ధిగా లభ్యత, మంచి ధరతో గులివందలే ఆదుకుంటున్నాయి.’ అని మైలపిల్లి రాము అనే బోటు యజమాని ‘సాక్షి’తో చెప్పారు.

రోజుకు 25–30 టన్నుల రాణి ఫిష్‌లు 
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌కు రోజుకు సగటున 150 టన్నుల చేపలు వస్తుంటాయి.  వీటిలో ప్రస్తుతం రాణి ఫిష్‌ (గులివిందలు) చేపలు 25–30 టన్నుల వరకు ఉంటున్నాయి. వీటిలో కొనుగోళ్లు చేయగా మిగిలిన చేపలను కొన్ని రోజులపాటు ఎండబెట్టిన తర్వాత విక్రయిస్తారు.

మరిన్ని వార్తలు