అదుపులో 'డెంగీ'!

11 Oct, 2020 03:37 IST|Sakshi

గతేడాది 39 వారాల్లో 2,450 కేసులు.. ఈ ఏడాది 39 వారాల్లో 527 

విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో గతేడాది ఉధృతం  

ఈ జిల్లాల్లో ఈ ఏడాది నామమాత్రంగా కేసులు 

గుంటూరులో గతేడాది 433 కేసులు.. ఇప్పుడు 89 

విజయనగరం జిల్లాలో అతి తక్కువగా 5 కేసులు  

సకాలంలో నియంత్రణా చర్యల వల్లే సత్ఫలితాలు 

మరో నెల పాటు డెంగీ నియంత్రణకు కార్యాచరణ 

సాక్షి, అమరావతి: తొలకరి జల్లులు మొదలయ్యాయంటే డెంగీ జ్వరాలు కోలుకోలేని దెబ్బతీస్తాయి. గత ఏడాది వరకు ఎక్కడ చూసినా డెంగీ బాధితులే. అలాంటిది ఈ ఏడాది డెంగీ జ్వరం కాస్త అదుపులోకొచ్చింది. గతంతో పోలిస్తే జ్వరాల తీవ్రత చాలా తగ్గిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈ ఏడాది ముందస్తు చర్యలు తీసుకోవడం వల్లే డెంగీ జ్వరాలు ఎక్కువగా నమోదు కాలేదని తేలింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 30 శాతం కేసులు కూడా నమోదు కాలేదు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఏడాది డెంగీ తీవ్రత బాగా తక్కువగా ఉంది. నవంబర్‌ 30 వరకూ ఇదే తరహాలో నియంత్రణ చేయగలిగితే ఈ ఏడాది డెంగీ బారి నుంచి క్షేమంగా బయటపడే అవకాశాలున్నాయి. 

నవంబర్‌ చివరి వరకు కార్యాచరణ 
► నవంబర్‌ నెలాఖరు వరకు డెంగీ నియంత్రణకు కార్యాచరణ చేపట్టారు. ప్రతి గ్రామాన్ని మున్సిపాలిటీ, ఆరోగ్య, పంచాయతీ రాజ్‌ శాఖలు జల్లెడ పడుతున్నాయి. 
► కాలనీల్లో, ఇంటి ముందర గుంటలు లేకుండా చూడటం, నీరు నిల్వ లేకుండా చేయడం, ప్రతి ప్రాంతంలో ఎంఎండీసీ (మొబైల్‌ మలేరియా, డెంగీ సెంటర్స్‌)ల ఏర్పాటుపై దృష్టి సారించారు.  
► డెంగీ లార్వా (గుడ్డు) దశలోనే విచ్ఛిన్నం చేసేందుకు పాత టైర్లు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, టైర్లు వంటి వాటిని పరిసరాల్లో లేకుండా చేస్తున్నారు.  
► అన్ని ఆస్పత్రుల్లో డెంగీని నిర్ధారించే ఎలీశా టెస్ట్‌ కిట్‌లు అందుబాటులో ఉంచారు. డెంగీ వలన వచ్చే ప్రమాదంపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.  

నియంత్రణకు మరిన్ని చర్యలు 
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డెంగీ కేసులు బాగా తగ్గాయి. నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రధానంగా లార్వా దశలోనే దీన్ని నియంత్రించడం వల్లే కేసులు తగ్గాయి. రానున్న నెల రోజులు కీలకం. ప్రజలు కూడా తమ ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా చేసుకుంటే డెంగీ దోమలు వృద్ధి అయ్యే అవకాశం తక్కువ.         
– డా.అరుణకుమారి, ప్రజారోగ్య శాఖ సంచాలకులు 

మరిన్ని వార్తలు