ముందస్తు.. మస్తు!

27 May, 2022 04:50 IST|Sakshi

ఈసారి ఘన దిగుబడులు.. వ్యవసాయ శాఖ అంచనాలు

ముందే కాలువలకు నీళ్లు.. జోరు వర్షాలతో ప్రకృతి సానుకూలం 

ఖరీఫ్‌లో ఆహార ధాన్యాల దిగుబడి అంచనా 95.16 లక్షల టన్నులు

చెరకు 50.15 లక్షల టన్నులు.. పత్తి 9.87 లక్షల టన్నులు

నూనెగింజలు 8.55 లక్షల టన్నులు.. మిరప 7.65 లక్షల టన్నులు

సాక్షి, అమరావతి: ఈసారి ముందస్తు ఖరీఫ్‌ సాగుతో మంచి దిగుబడులొస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. గతేడాదితో పోలిస్తే మెరుగైన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. 4 దశాబ్దాల తర్వాత 15–30 రోజులు ముందుగానే కాలువలకు నీటిని వదలనుండటంతో వైపరీత్యాలు, తుపాన్ల బారిన పడకుండా పంటలు చేతికందనున్నాయి. గత ఖరీఫ్‌లో 165 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేయగా అకాల వర్షాలు, వైపరీత్యాలతో 159.82 లక్షల టన్నులు వచ్చాయి. ఈ ఏడాది ముందస్తు అంచనాల ప్రకారం ఖరీఫ్‌లో 171.62 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు.

ఆహార ధాన్యాల్లో రికార్డు
ఆహార ధాన్యాల దిగుబడులు గతేడాది 77.35 లక్షల టన్నులు రాగా ఈసారి ఖరీఫ్‌లో 95.16 లక్షల టన్నులు వస్తాయని అంచనా వేశారు. 2019 ఖరీఫ్‌లో రికార్డు స్థాయిలో 87.77 లక్షల టన్నుల దిగుబడులొచ్చాయి. ఈసారి అంతకు మించి వస్తాయంటున్నారు. వైపరీత్యాల ప్రభావంతో గతేడాది ధాన్యం దిగుబడి 70.96 లక్షల టన్నులకే పరిమితమైంది. ఈసారి 85.58 లక్షల టన్నుల ధాన్యం రానున్నట్లు అంచనా. 2019లో రికార్డు స్థాయిలో 80.13 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి నమోదైంది.

భారీగా పెరగనున్న చెరకు 
ధాన్యం తర్వాత ఈసారి చెరకు దిగుబడులు గణనీయంగా రానున్నట్లు అంచనా. 2019లో 67.17 లక్షల టన్నులు, 2020లో 41.15 లక్షల టన్నులు, 2021లో 36.54 లక్షల టన్నుల చెరకు దిగుబడులొచ్చాయి. ఈ ఏడాది 50.15 లక్షల టన్నుల దిగుబడులొస్తాయని అంచనా వేస్తున్నారు. అపరాలు గతేడాది 1.14 లక్షల టన్నుల దిగుబడులు రాగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 2.18 లక్షల టన్నులు వచ్చే అవకాశం ఉంది. నూనె గింజల్లో ప్రధానంగా వేరుశనగ గతేడాది 5.40 లక్షల టన్నుల దిగుబడి రాగా ఈసారి 8.28 లక్షల టన్నులు రావచ్చని అంచనా వేస్తున్నారు. మొక్కజొన్న గతేడాది 4.41 లక్షల టన్నులు రాగా ఈ ఏడాది 5.74 లక్షల టన్నులొస్తుందని భావిస్తున్నారు. ఇలా ప్రధాన పంటల దిగుబడులు గతేడాదితో పోలిస్తే మెరుగ్గా ఉంటాయని అంచనా వేస్తున్నారు.

ముందస్తు సాగుతో సత్ఫలితాలు 
రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఖరీఫ్‌ కోసం సాగునీటి ప్రణాళికను ప్రకటించింది. ఈసారి మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్టోబర్‌ నాటికి పంటలు చేతికి వచ్చేలా ప్రణాళికకు అనుగుణంగా సాగు చేపడితే సత్ఫలితాలు సాధించవచ్చు.ఖరీఫ్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా రైతన్నలు ముందస్తు సాగుకు సిద్ధం కావాలి.
– చేవూరు హరికిరణ్, స్పెషల్‌ కమిషనర్, వ్యవసాయ శాఖ  

మరిన్ని వార్తలు