పచ్చదనం పెంపులో వ్యవసాయ శాఖ టాప్‌ 

1 Feb, 2021 05:48 IST|Sakshi

‘జగనన్న పచ్చతోరణం’లో లక్ష్యాన్ని మించి మొక్కలు నాటిన సిబ్బంది 

వంద శాతం లక్ష్యం సాధించిన వైద్య ఆరోగ్యశాఖ 

రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న కార్యక్రమం

సాక్షి, అమరావతి: పచ్చదనం పెంపులో వ్యవసాయ శాఖ ప్రగతి దిశగా దూసుకెళ్తోంది. జగనన్న పచ్చతోరణం కింద మొక్కలు నాటే లక్ష్య సాధనలో వ్యవసాయ శాఖ అన్ని శాఖల కంటే అగ్రస్థానంలో ఉంది. వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే వంద శాతం లక్ష్యం పూర్తి చేసింది. పర్యావరణ, జీవావరణ పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏడాది జూలై 22న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ పథకం ప్రారంభించారు. 2020–21లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించి చెట్లుగా మారేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక సంస్థలు, వన సంరక్షణ సమితులు ఈ మహాక్రతువులో భాగస్వామ్యం కావాలని ఉద్బోధించారు. అటవీ శాఖ నోడల్‌ ఏజెన్సీగా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటవీ శాఖ వివిధ శాఖల అధికారులతో మాట్లాడి లక్ష్యాలు ఖరారు చేసింది. అటవీశాఖ స్వయంగా సామాజిక అటవీ విభాగం ద్వారా నర్సరీల్లో 6.03 కోట్ల మొక్కలు నాటేందుకు వివిధ విభాగాలకు పంపిణీ చేసింది. అటవీ శాఖ వన సంరక్షణ సమితులను, పరిశ్రమల శాఖ పేపర్‌ మిల్లులనూ భాగస్వామ్యం చేసింది. 

విభాగాల వారీగా.. 
► మొక్కలు నాటేందుకు తక్కువ అవకాశం ఉన్న శాఖలకు తక్కువగానే లక్ష్యం నిర్దేశించారు. 
► లక్ష్యం ప్రకారం వ్యవసాయ శాఖ అన్నింటికంటే ముందుంది. ఈ శాఖ లక్ష మొక్కలు నాటాలని లక్ష్యం కాగా, ఇప్పటికే 1,51,621 మొక్కలు నాటింది.  
► ఆంధ్రప్రదేశ్‌ అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎఫ్‌డీసీ) 5,74,485 మొక్కలు నాటాలని లక్ష్యంకాగా ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించింది.  
► వైద్య ఆరోగ్య శాఖ 100% లక్ష్యం సాధించింది. వెనుక బడిన తరగతుల సంక్షేమ శాఖ 97.96 శాతం, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) 91.5 శాతం, దేవదాయ, ధర్మాదాయ శాఖ 90.21 శాతం, ఉద్యాన శాఖ 82.32 శాతం లక్ష్యం చేరుకున్నాయి.  
► జలవనరుల శాఖ 6.17 శాతం, రహదారులు, భవనాల శాఖ 7.01 శాతం, పాఠశాల విద్యాశాఖ 10.58 శాతం లక్ష్యసాధనతో చిట్టచివర్లో ఉన్నాయి.  
► ఉద్యాన శాఖ పరిధిలో చిత్తూరు జిల్లాలో రికార్డు స్థాయిలో 80,23,923 మొక్కలు నాటడం విశేషం.   

మరిన్ని వార్తలు