Corona Third Wave: బ్లాక్‌ మార్కెట్‌కు చెక్‌

29 Jan, 2022 23:15 IST|Sakshi

మూడో దశ కరోనా నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ అప్రమత్తం

మందుల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు 

13 జిల్లాల అధికారులతో నిరంతరం సమీక్ష 

నిల్వలు తక్కువైతే అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు

రాష్ట్రంలో మోల్నుపిరవిర్‌ మాత్రల తయారీకి అనుమతులు 

ఇప్పటికే రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు రాష్ట్రంలోనే తయారు

సాక్షి, అమరావతి : కరోనా తొలి, మలి విడతల్లో విటమిన్‌ టాబ్లెట్లతోపాటు కొన్ని రకాల మందులకు తీవ్ర డిమాండ్‌ ఏర్పడడంతో మెడికల్‌ మాఫియా అప్పట్లో బ్లాక్‌ మార్కెట్‌ దందాకు తెరతీసింది. ప్రస్తుతం మూడో దశ వ్యాప్తి నేపథ్యంలో ఔషధ నియంత్రణ శాఖ నాటి పరిస్థితులకు చెక్‌ చెబుతూ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా.. కరోనాకు సంబంధించిన 30 రకాల అత్యవసర మందుల నిల్వలను నిరంతరం పర్యవేక్షిస్తోంది.

ఆ శాఖ ఉన్నతాధికారులు వారంలో రెండుసార్లు 13 జిల్లాల ఔషధ నియంత్రణ అధికారులతో సమీక్షలు నిర్వహించి మార్కెట్‌లో మందుల నిల్వల సమాచారం సేకరిస్తున్నారు. ఏవైన మందుల నిల్వలు తక్కువగా ఉన్నట్లైతే డిమాండ్‌కు సరిపడా వాటిని అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇండెంట్‌ పెట్టిన వెంటనే మందులు సరఫరా చేసేలా పంపిణీదారులను ఆదేశిస్తున్నారు.  

రాష్ట్రంలో ఉత్పత్తికి అనుమతులు 
ఇక కరోనా రోగుల చికిత్సలో వినియోగించేందుకు అవకాశమున్న మోల్నుపిరవిర్‌ మాత్రలను రాష్ట్రంలోనే తయారుచేసేందుకు ప్రభుత్వం లైసెన్స్‌లు ఇచ్చింది. దీంతో కరోనా మూడో దశ మందుల ప్రోటోకాల్‌ జాబితాలో ఈ మాత్రలకు అనుమతిస్తే వీటికి కొరత ఏర్పడే అవకాశం ఉండదు. నాట్కో, లారస్, దివీస్‌ ఫార్మా కంపెనీలు ఈ మందును తయారుచేయనున్నాయి. చిన్న పిల్లలు, గర్భిణులు, మరికొందరికి ఈ మందును వినియోగించకూడదని ఐసీఎంఆర్‌ వెల్లడించింది. అదే విధంగా కరోనా రెండో దశ చికిత్సలో కీలకంగా మారిన రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు ప్రస్తుతం రాష్ట్రంలోనే తయారవుతున్నాయి.

పుష్కలంగా మందుల నిల్వలు
రాష్ట్రంలో మందుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం పుష్కలంగా వాటి నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం పీఎస్‌ఏ (ఆక్సిజన్‌) ప్లాంట్లను భారీగా ఏర్పాటుచేసింది. దీంతో ఆక్సిజన్‌కు కొరత లేదు. ఎక్కడైనా ఎమ్మార్పీని మించి మందులు విక్రయిస్తే వినియోగదారులు ఔషధ నియంత్రణ శాఖకు ఫిర్యాదు చేయాలి. ఎక్కువగా వినియోగంలో ఉన్న మందులపై ప్రత్యేక నిఘా ఉంచాం. నకిలీ మందులు చెలామణి కాకుండా చూస్తున్నాం.  
– రవిశంకర్‌ నారాయణ్, ఔషధ నియంత్రణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌

మరిన్ని వార్తలు