అసత్య కథనాలతో దుష్ప్రచారం: ఆదా.. కానరాదా?

11 Jun, 2021 03:36 IST|Sakshi

ఈనాడు దాచిన నిజాలు..విద్యుత్‌ కొనుగోళ్లలో ఆదా చేస్తే నష్టమంటూ దుష్ప్రచారం

పీపీఏ సంస్థలు కోత పెట్టడం వల్లే కొనుగోలు

నెలలోనే రూ. 22.7 కోట్ల ప్రజాధనం మిగులు

రూ. 48 కోట్ల నష్టం ఓ కట్టు కథే

చౌక విద్యుత్‌ కొనుగోలులో మనమే ఫస్ట్‌: ఇంధన శాఖ

నష్టం వచ్చిందని మేం చెప్పలేదు:ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ నాగార్జున రెడ్డి

సాక్షి, అమరావతి: విద్యుత్‌ కొనుగోళ్లపై కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ అసత్య కథనాలు ప్రచురించడాన్ని ఇంధనశాఖ తీవ్రంగా తప్పుబట్టింది. పీపీఏలున్న విద్యుత్‌ సంస్థలు కరెంట్‌ సరఫరాలో కోత పెట్టినప్పటికీ మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేసి నెల రోజుల్లో రూ.22.7 కోట్లు లాభం చేకూర్చామని స్పష్టం చేసింది. వాస్తవాలు ఇలా ఉండగా డిస్కమ్‌లకు రూ.48 కోట్లు నష్టం వాటిల్లిందంటూ వాస్తవ విరుద్ధ కథనాలు ప్రచురించారని ఇంధనశాఖ పేర్కొంది. విద్యుత్‌ కొనుగోళ్లను కట్టడి చేయడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ ముందు వరుసలో ఉందని, దీన్ని నీతి అయోగ్‌ కూడా ప్రశంసించిందని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి గుర్తు చేశారు.

ఏపీఈఆర్‌సీ నిరంతర పర్యవేక్షణ..
నిజానికి విద్యుత్‌ కొనుగోళ్లపై గత రెండేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. మరీ ముఖ్యంగా చౌక విద్యుత్‌నే సాధ్యమైనంత వరకూ కొనుగోలు చేస్తోంది. దీనికోసం ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) నిరంతరం పర్యవేక్షిస్తోంది. గతేడాది డిసెంబర్‌ 17 నుంచి జనవరి 15వ తేదీ వరకూ జరిగిన విద్యుత్‌ కొనుగోళ్ల వివరాలను ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి విశ్లేషించింది.

బొగ్గు కొరత, కోవిడ్, ఇతర కారణాలు..
ఈ నెల రోజుల వ్యవధిలో ఏపీ విద్యుత్‌ సంస్థలు 894.1 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను  బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేశాయి. రాష్ట్ర డిస్కమ్‌లు కొన్ని చౌకగా విద్యుత్‌ అందించే ఉత్పత్తి కేంద్రాలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రకారం వీటి ద్వారా డిసెంబర్‌ 17 నుంచి జనవరి 15 వరకూ 3,289.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ యూనిట్‌ రూ.3.13 చొప్పున డిస్కమ్‌లకు అందాలి. అయితే ఆయా కేంద్రాల్లో బొగ్గు కొరత, కోవిడ్‌ ప్రభావం, ఇతర కారణాల వల్ల ముందు రోజు ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 2,470.79 మిలియన్‌ యూనిట్లే విద్యుత్‌ ఇస్తామని ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. కానీ వాస్తవంగా విద్యుత్‌ అందించే రోజుకు రీ షెడ్యూల్‌ చేసుకుని చివరకు 2,253.27 ఎంయూలే ఇచ్చాయి. 818.5 ఎంయూల విద్యుత్‌ను అందించలేకపోయాయి.

లేని విద్యుత్‌ ఎలా కొంటారు?
పీపీఏల ప్రకారం 818.5 ఎంయూల కొరత ఏర్పడటంతో పీపీఏలున్న ఇతర ఉత్పత్తిదారుల నుంచి అదనంగా విద్యుత్‌ తీసుకోవాలి. అయితే వాటి దగ్గర ఆ సమయంలో విద్యుత్‌ ధర యూనిట్‌ రూ. 3.68 ఉంది. కానీ మార్కెట్లో విద్యుత్‌ ధర యూనిట్‌ రూ. 3.38 చొప్పున మాత్రమే ఉంది. అంటే ప్రతీ యూనిట్‌కు సంస్థ 30 పైసల చొప్పున, మొత్తం రూ. 24.6 కోట్లు ఆదా చేసింది. ఇందులో గ్రిడ్‌ బ్యాలన్స్‌ కోసం రూ.1.9 కోట్లు తీసివేసినా... రూ.22.7 కోట్లు ఈ నెలలోనే విద్యుత్‌ కొనుగోళ్లలో ఆదా అయింది.  కానీ ఒక వర్గం మీడియా మాత్రం పీపీఏ సంస్థల నుంచే ఈ విద్యుత్‌ కొంటే నష్టం రాదని అసత్యాలు ప్రచారం చేసింది. అసలు వాళ్ల దగ్గర విద్యుత్‌ లేనప్పుడు ఎలా కొనుగోలు చేస్తామని  విద్యుత్‌ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

దేశానికి ఆదర్శంగా ఏపీ..
– శ్రీకాంత్‌ నాగులాపల్లి (ఇంధనశాఖ కార్యదర్శి)
ఒప్పందం చేసుకున్న సంస్థలు విద్యుత్‌ ఇవ్వకపోతే మార్కెట్లో విద్యుత్‌ కొనక తప్పదు. లేకపోతే రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు ఏర్పడతాయి. కొనే విద్యుత్‌ను పీపీఏ సంస్థల నుంచే తీసుకోవాలనే వాదన సత్యదూరం. అసలు తమ దగ్గర విద్యుత్‌ లేదని వారే ప్రకటించినప్పుడు ఇక తక్కువ ధరకు వాళ్లు ఎలా ఇస్తారు? విద్యుత్‌ కొనగోళ్లను దారికి తేవడంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలిచింది.

నష్టమని మేం చెప్పలేదే?
– జస్టిస్‌ సీవీ నాగార్జున రెడ్డి, ఏపీఈఆర్‌సీ ఛైర్మన్‌
విద్యుత్‌ కొనుగోళ్లు మరింత పారదర్శంగా ఉండాలని కమిషన్‌ కోరుకుంటోంది. ఇందులో భాగంగానే వాస్తవాలు తెలుసుకునేందుకు డిస్కమ్‌ల నుంచి వివరణ కోరాం. అంతేతప్ప మార్కెట్‌ నుంచి విద్యుత్‌ కొనడం వల్ల డిస్కమ్‌లకు నష్టం వచ్చిందని మేం ఎక్కడా చెప్పలేదు. డిస్కమ్‌లు పంపే వివరాలను కమిషన్‌ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీగా జరిగే వ్యవహారం.

మరిన్ని వార్తలు