5 శాతం వడ్డీరాయితీ ఇవ్వండి

12 Jul, 2021 02:26 IST|Sakshi

‘ఇంధన పొదుపు’ పెట్టుబడులకు అవసరం

కేంద్రానికి ఇంధన శాఖ లేఖ

సాక్షి, అమరావతి: కేంద్రం చేయూతనిస్తే ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక విద్యుత్‌ పొదుపుపై మెరుగైన ఫలితాలు సాధించగలమని రాష్ట్ర ఇంధనశాఖ కేంద్రానికి లేఖ రాసింది. సమర్థ ఇంధనం, పొదుపు కోసం పరిశ్రమలు చేపట్టే చర్యలకు అవసరమైన పెట్టుబడులకు అయ్యే వడ్డీపై కనీసం 5 శాతం రాయితీ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖకు రాష్ట్ర ఇంధన శాఖ లేఖ రాసినట్టు రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీఈవో ఎ.చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ప్రధానంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్లో సమర్థ ఇంధన చర్యలు వేగవంతం చేయాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఈ దిశగా రాష్ట్రం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. పరిశ్రమలు ఇంధన పొదుపు దిశగా అడుగులేయాలంటే ప్రస్తుతం ఉన్న ఉపకరణాలు సమూలంగా మార్చాల్సి ఉంటుంది. తక్కువ కరెంట్‌ వినియోగించే పరికరాలు వాడాలి.

ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం కేంద్ర ఇంధన పొదుపు సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియన్సీ అందిస్తోంది. ఉపకరణాలు, యంత్రాల కొనుగోలుకు వివిధ సంస్థలు రుణాలిస్తున్నాయి. అయితే కోవిడ్‌ కారణంగా ఏపీ సహా దేశవ్యాప్తంగా పారిశ్రామిక రంగం ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల అభిప్రాయం కోరింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఇంధనశాఖ పెట్టుబడులుగా పొందే అప్పుపై 5 శాతం రాయితీని కేంద్రం అందించాలని కోరింది. దీనివల్ల మరింత మెరుగైన ఇంధన పొదుపు చేయడానికి వీలుందని తెలిపింది.

రాష్ట్రంలో వార్షిక విద్యుత్తు డిమాండ్‌ 61,818 మిలియన్‌ యూనిట్లు. ఇంధన సామర్థ్యం గల ఉపకరణాలను వాడితే వార్షిక వినియోగంలో కనీసం 15 వేల మిలియన్‌ యూనిట్ల (25 శాతం) పొదుపునకు ఆస్కారం ఉందని అంతర్గత ఆడిట్‌లో గుర్తించారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇప్పటివరకు 2,932 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే పొదుపు చేయగలుగుతున్నారు. అతి ముఖ్యమైన పారిశ్రామిక రంగంలో పొదుపు ప్రక్రియను ముందుకు తీసుకెళ్తే కొంతమేరైనా విద్యుత్‌ ఖర్చు తగ్గించే వీలుంది. 

మరిన్ని వార్తలు