వాళ్ల వల్లే కరెంట్‌ కష్టాలు తగ్గాయ్‌..!

2 Oct, 2020 08:05 IST|Sakshi

అంతరాయాల లెక్కే నిదర్శనం 

వాళ్లుండాల్సింది ఫీల్డ్‌లోనే.. గ్రామ సచివాలయాల్లో కాదు.. 

జూనియర్‌ లైన్‌మెన్‌లు డిస్కమ్‌ ఉద్కోగులే 

ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ 

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యుత్‌ అంతరాయాలు 37.44% మేర తగ్గాయని ఇంధనశాఖ తెలిపింది.  గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న జూనియర్‌ లైన్‌మెన్‌లు రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఉద్యోగులేనని, వారికి డిస్కమ్‌లే వేతనాలు చెల్లిస్తున్నాయని స్పష్టం చేశారు. వాళ్లంతా సచివాలయాల్లో అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాళ్లు ఫీల్డ్‌కు వెళ్లి పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నియమించిన 7 వేల మంది జూనియర్‌ లైన్‌మెన్‌ల పనితీరుపై వదంతుల నేపథ్యంలో ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ గురువారం మీడియాకు వాస్తవాలను వివరించారు. 

కరెంట్‌ పోతే క్షణాల్లో... 
జూనియర్‌ లైన్‌మెన్లకు గ్రామ సచివాలయంతో సంబంధం ఉన్నా.. విధివిధానాలన్నీ విద్యుత్‌ సంస్థల నిబంధనల మేరకే ఉంటాయి.
ఒక్కో జూనియర్‌ లైన్‌మెన్‌కు 1500 విద్యుత్‌ కనెక్షన్ల నిర్వహణ బాధ్యత అప్పగించాం. 30 నుంచి 40 ట్రాన్స్‌ఫార్మర్లు పర్యవేక్షించాలి. 10 కి.మీ. పరిధి వరకు లైన్‌పై చెట్లు పడ్డా, జంపర్లు తెగిపోయినా వాళ్లే బాగుచేస్తారు.  
ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయినా, చెడిపోయినా, వినియోగదారుల మీటర్లు ఆగిపోయినా కొత్తవి బిగించడం వారి విధుల్లో భాగం.  
ఫీల్డ్‌లో పనిచేయడంతో గ్రామ సచివాలయానికి హాజరు కాలేకపోతున్నారు. ఈ కారణంగా వాళ్లు పనిచేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇది వాస్తవం కాదు.  
విద్యుత్‌కు సంబంధించిన ఏ సమస్య గ్రామ సచివాలయానికి వచ్చినా అధికారులు ఫోన్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ను సంప్రదిస్తారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే కరెంట్‌ సమస్యలను పరిష్కరించాలి.  

దారికొచ్చిన అంతరాయాలు 
గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఎక్కువ గంటలు కరెంట్‌ పోయిందనే ఫిర్యాదులు క్రమంగా తగ్గుతున్నాయి. 2018–19లో 6,98,189 విద్యుత్‌ అంతరాయాల ఫిర్యాదులొస్తే 2019–20లో వీటి సంఖ్య 4,36,781గా నమోదైంది. అంటే.. దాదాపు 2.60 లక్షల ఫిర్యాదులు తగ్గాయి.

ప్రజలకు అందుబాటులో ఉంటున్నా..
ఐటీఐ పూర్తిచేసి ఎల్రక్టీషియన్‌గా ప్రైవేట్‌ పనులు చేసేవాడిని. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసిన తర్వాత జూనియర్‌ లైన్‌మన్‌గా ఉద్యోగం వచ్చింది. విద్యుత్‌ సమస్య వస్తే గ్రామ సచివాలయం నుంచి ఫోన్‌లో మెసేజ్‌ వస్తోంది. వెంటనే ఫీల్డ్‌కు వెళ్లి విద్యుత్‌ అంతరాయాలు లేకుండా చూస్తున్నా.  ఎక్కువ సమయం ఫీల్డ్‌లోనే ఉంటున్నా. గ్రామ సచివాలయానికి వెళ్లలేకపోతున్నా.   –అజయ్‌కుమార్, జూనియర్‌ లైన్‌మన్, గోపినేనిపాలెం, వత్సవాయి మండలం, కృష్ణా జిల్లా

మరిన్ని వార్తలు