ఆదా.. ఇదిగో

8 Mar, 2023 02:33 IST|Sakshi

శ్రీకాకుళంలో స్మార్ట్‌ మీటర్లతో 33.24 శాతం విద్యుత్‌ ఆదా 

ప్రయాస్‌ సంస్థ స్మార్ట్‌ మీటర్లు వద్దనలేదు 

అయినా అవి ఏడాదిన్నర క్రితం చేసిన సూచనలు 

16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో రైతులు రెడీ 

అలైడ్‌ మెటీరియల్, మీటర్లకు రూ.4,000 కోట్లు భరిస్తున్న ప్రభుత్వం.. పదేపదే తప్పుడు వార్తలపై చట్టపరమైన చర్యలు  

ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్‌   

సాక్షి, అమరావతి: ‘‘శ్రీకాకుళంలో స్మార్ట్‌ మీటర్లను అమర్చడం, నెలవారీ రీడింగ్‌లు నమోదు చేయడం అభినందనీయం. వ్యవసాయ విద్యుత్‌ మీటరింగ్‌ కోసం విలువైన పాఠాలను అందించేలా ఈ ప్రయోగం చేపట్టిన డిస్కమ్‌లు, సంబంధిత విభాగాలను అభినందించాల్సిన అవసరం ఉంది’’ 
– తుది నివేదికలో ప్రయాస్‌ సంస్థ ప్రశంసలివీ..

వ్యవసాయ బోర్లకు స్మార్ట్‌ విద్యుత్‌ మీటర్లను అమర్చడం వల్ల రైతులకు మేలేగానీ కీడు జరగదు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం, ఇంధన శాఖ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేసినా కొన్ని పార్టీలు, వాటి అనుకూల మీడియా పని గట్టుకుని విషప్రచారం చేస్తూనే ఉన్నాయి. అన్నదాతలను అయోమయంలోకి నెట్టేయాలనే దురుద్దేశంతో వ్యవహరి­స్తున్నాయి. స్మార్ట్‌ మీటర్ల వల్ల ఏ మీటర్‌లో ఎంత విద్యుత్‌ వినియోగం జరుగుతోందనేది ప్రతి 15 నిమిషాలకు ఒకసారి తెలుస్తుంది.

అదే డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ల వద్ద మీటర్లు పెట్టి రీడింగ్‌ తీస్తే వాటి పరిధిలోని నాలుగైదు మీటర్ల విద్యుత్‌ వినియోగం వస్తుంది. ఏ రైతు ఎంత విద్యుత్‌ వాడుతున్నారనేది కచ్చితంగా చెప్పడం కష్టం. పంటలు ఉన్నప్పుడు మీటర్ల దగ్గరికి వెళ్లడం చాలా కష్టం. అదే స్మార్ట్‌ మీటర్లతో ఈ సమస్యలన్నీ తీరుతాయి. రిమోట్‌ ద్వారా మీటర్‌ను ఆపరేట్‌ చేయవచ్చు. రీడింగ్‌ కోసం మీటర్‌ దగ్గరకు వెళ్లవలసిన అవసరం ఉండదు. 

రక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మీటర్‌ అమర్చడమే కాకుండా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్, మోటార్‌ కాలిపోకుండా, రైతుల ప్రాణ సంరక్షణ బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంది. అందుకు అవసరమైన ఐదు రక్షణ పరికరాలను (అలైడ్‌ మెటీరియల్‌) మీటర్లతో పాటు ఏర్పాటు చేయనుంది. మిగతా రాష్ట్రాల్లో కేవలం మీటర్లే ఇస్తున్నారు. మన దగ్గర స్మార్ట్‌ మీటర్‌తో పాటు మోల్డెడ్‌ కేస్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌(ఎంసీసీబీ)తో కూడిన షీట్‌ మౌడ్లింగ్‌ కాంపొనెంట్‌(ఎస్‌ఎంసీ) బాక్స్‌ను అందిస్తున్నారు.

ప్రస్తుతం ఫ్యూజు కారియర్లు ఇనుముతో చేసినవి ఉండగా వాటి స్థానంలో తాకినా విద్యుత్‌ షాక్‌ కొట్టని మెటీరియల్‌తో ఈ బాక్సులు తయారవుతాయి. ఇప్పుడున్నట్లు మూడు ఫ్యూజులు కూడా ఉండవు. దానివల్ల మోటార్లు కాలిపోయే అవకాశం ఉండదు. అలాగే ఎర్తింగ్‌ పైప్‌ కూడా ఇస్తారు. ఓల్టేజ్‌ సమస్యల నుంచి కాపాడేందుకు షంట్‌ కెపాసిటర్లను అమర్చుతారు. ఈ ఏర్పాటు వల్ల విద్యుత్‌ ప్రమాదాల నుంచి రైతులకు, జీవాలకు, వాతావరణ పరిస్థితుల నుంచి స్మార్ట్‌ మీటర్లకు రక్షణ లభిస్తుంది. అలైడ్‌ మెటీరియల్, మీటర్లకు కలిపి ప్రభుత్వం రూ.4,000 కోట్లు భరిస్తోంది.

ఎవరు చెప్పారు?
వాస్తవాలను వక్రీకరిస్తూ తప్పుడు సమాచారంతో అబద్ధాలను అడ్డంగా అచ్చేసిన ఈనాడు రాతలను ఇంధన శాఖ తీవ్రంగా తప్పుబట్టింది. వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు పెట్టవద్దని, వాటివల్ల విద్యుత్‌ ఆదా జరగకపోగా ఖర్చు వృథా అని ఏ సంస్థగానీ, రైతులుగానీ చెప్పలేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ స్పష్టం చేశారు. ఇంధన శాఖ జాయింట్‌ సెక్రటరీ బీఏవీపీ కుమార్‌రెడ్డి, ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, సెంట్రల్‌ డిస్కమ్‌ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డితో కలసి విజయవాడలోని విద్యుత్‌ సౌధలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

► మీటర్లు అమర్చడం ద్వారా డిస్కమ్‌లలో జవాబుదారీతనం పెరగడంతో పాటు రైతులకు ఉచిత విద్యుత్‌ హక్కుగా లభిస్తుంది. ‘ప్రయాస్‌’ సంస్థ ఏడాదిన్నర క్రితం జరిపిన శాంపుల్‌ అధ్యయనంలో పలు సూచనలు మాత్రమే చేసింది. సగటు విద్యుత్‌ కొనుగోలు ధరను ప్రయాస్‌ ఎనర్జీ గ్రూప్‌ ఒక యూనిట్‌కి రూ.4.20 చొప్పున తీసుకుని లెక్కించడం వల్లే గణాంకాలు సరిగా లేవు. వాస్తవానికి సగటు సరఫరా ఖర్చు ఒక యూనిట్‌కి రూ.6.98 చొప్పున ఉంది. దీన్ని ఏపీఈఆర్‌సీ నిర్ణయించింది. 

► ఫీడర్ల వద్ద నష్టాలు నమోదవుతున్నట్లు ప్రయాస్‌ చెబుతున్నా స్మార్ట్‌ మీటర్లు అమర్చిన తరువాత ఫీడర్‌ రీడింగ్‌ తీయలేదు. ఆ నష్టం విద్యుత్‌ చౌర్యం వల్ల జరిగి ఉండవచ్చు. ఇలాంటివి అరికట్టేందుకే స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నాం.

► రెండు, మూడు వారాల్లో స్మార్ట్‌ మీటర్ల టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. రైతులను గందరగోళానికి గురిచేస్తూ పదేపదే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్న పత్రికలు, ప్రసారం చేస్తున్న ఛానళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వాటి యాజమాన్యాలకు లీగల్‌ నోటీసులు కూడా పంపుతున్నాం. 

► మొత్తం 16,66,282 వ్యవసాయ సర్వీసుల్లో 16,55,988 మంది రైతులు బ్యాంకు ఖాతాలు తెరిచి నిరభ్యంతర పత్రాలిచ్చారు. 10,294 మందికి మాత్రమే ఖాతాలు లేవు. వారితో కూడా తెరిపించేందుకు డిస్కమ్‌లు ప్రయత్నిస్తున్నాయి.  

శ్రీకాకుళంలో ఇలా..
శ్రీకాకుళంలో పైలట్‌ ప్రాజెక్టుగా 2023 ఫిబ్రవరి నాటికి 29,302 సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లను అమర్చగా 83.16 శాతం పని చేస్తున్నాయి. ఈ మీటర్ల ద్వారా 2021–22లో 33.24 శాతం అంటే 2.81 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ ఆదా అయ్యింది. సగటున 6.66 శాతం మాత్రమే పాడవడం, కాలిపోవడం జరిగింది. భవిష్యత్తులో వాటి మరమ్మతుల ఖర్చు సరఫరా సంస్థ భరించేలా టెండర్లు రూపొందించారు. అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్‌ మీటర్లు పెడితే కేవలం రెండున్నరేళ్లలోనే పెట్టుబడి వెనక్కి వస్తుంది. 

మరిన్ని వార్తలు