ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ మొదలు .. మార్కెటింగ్‌ వరకు

24 Nov, 2020 03:52 IST|Sakshi
విశాఖలో పరిశ్రమశాఖ అధికారులకు శిక్షణ ఇస్తున్న నిపుణులు

‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ ద్వారా పరిశ్రమలకు చేయూత 

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల అమలుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు 

ప్రధాన కార్యాలయంతో జిల్లా కేంద్రాల అనుసంధానం ద్వారా సేవలు 

పారిశ్రామిక కారిడార్లు, ప్రోత్సాహకాలు, ఎగుమతి, దిగుమతి అవకాశాలపై అవగాహన.. ఈ విధానంపై 11 జిల్లాల్లో ఉద్యోగులకు ముగిసిన శిక్షణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు ఎటువంటి నష్టభయం అనేది లేకుండా పూర్తిస్థాయి చేయూత (హ్యాండ్‌ హోల్డింగ్‌) అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ వేగంగా అడుగులు వేస్తోంది. ఇందుకోసం 2020–23 నూతన పారిశ్రామిక విధానంలో ప్రతిపాదించిన ‘వైఎస్సార్‌ ఏపీ వన్‌’ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన ప్రణాళికలను సిద్ధం చేసింది. మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్‌ ఏపీ వన్‌ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్రంలోని 13 జిల్లాల పెట్టుబడి కేంద్రాల్లో (ఇన్వెస్ట్‌మెంట్‌ సెంటర్స్‌) ఏపీ వన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటిని కేంద్ర కార్యాలయంతో అనుసంధానం చేయనున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేయడంతో పాటు పెట్టుబడి ఆలోచనతో వచ్చిన వ్యక్తికి ప్రాజెక్టు రిపోర్ట్‌ దగ్గర నుంచి యూనిట్‌ ప్రారంభించి తయారు చేసిన వస్తువుల (ప్రొడక్ట్‌) మార్కెటింగ్‌ వరకు పూర్తిస్థాయిలో సహకారం అందించనున్నట్లు పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జవ్వాది సుబ్రమణ్యం ‘సాక్షి’కి తెలిపారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాస్థాయి పరిశ్రమల అధికారులకు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే మొత్తం 11 జిల్లాలలో ఈ శిక్షణ తరగతులు నిర్వహించగా, ఈ నెల 26న ఏలూరులో తూ.గోదావరి, ప.గోదావరి జిల్లాల అధికారులకు నిర్వహించే తరగతులతో ఈ శిక్షణ కార్యక్రమాలు ముగియనున్నాయి. 

కారిడార్ల నుంచి కేంద్ర రాయితీల వరకు .. 
రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్న పారిశ్రామిక కారిడార్లు, ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏపీ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద ఇస్తున్న ప్రోత్సాహకాలపై అధికారులకు పునశ్చరణ తరగతులు నిర్వహించారు. 1978లో జిల్లా పెట్టుబడి కేంద్రాల విధానం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో శిక్షణ  తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమమని అధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో తయారు చేసే ఉత్పత్తులను ఏయే దేశాలకు ఎగుమతి చేయవచ్చు, అలాగే రాష్ట్ర అవసరాలకు కావాల్సిన ముడి వస్తువులను ఏయే దేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు వంటి విషయాలపై కూడా అధికారులకు శిక్షణ ఇచ్చారు.    

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా