ఈ ఏడాది 21,500 ఎంఎస్‌ఎంఈలు

17 May, 2022 03:37 IST|Sakshi

వీటి ద్వారా రూ.13,368 కోట్ల పెట్టుబడులు.. 2.53 లక్షల మందికి ఉపాధి

గతేడాది 15,000 యూనిట్ల లక్ష్యంలో చేరుకున్నది 10,613

గతేడాది లక్ష్యాన్ని కూడా ఈ ఏడాది పూర్తి చేసే విధంగా ప్రణాళిక

624 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ల నిర్వహణ

2022–23కి ఎంఎస్‌ఎంఈ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

నేడు 20కి పైగా పారిశ్రామిక సంఘాలతో పరిశ్రమల శాఖ వర్చువల్‌ సమావేశం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటుండటంతో ఈ ఏడాది సూక్ష్మ, చిన్న, మధ్యతరగతి (ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా 2022–23లో కొత్తగా 21,500 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ యూనిట్ల ద్వారా రూ.13,368 కోట్ల పెట్టుబడులతోపాటు 2,53,690 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తోంది.

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా లక్ష ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 2021–22లో 15,000 యూనిట్లు ఏర్పాటు చేయడం ద్వారా రూ.7,500 కోట్ల పెట్టుబడులు, 1.50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. కోవిడ్, ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వంటి కారణాలతో 2021–22లో కొత్తగా 10,613 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.2,632 కోట్ల పెట్టుబడులు వాస్తవరూపంలోకి రావడంతోపాటు 66,310 మందికి ఉపాధి లభించింది. దీంతో 2021–22 సంబంధించి మిగిలిన లక్ష్యాన్ని కూడా ఏడాదిలో పూర్తి చేసే విధంగా ఎంఎస్‌ఎంఈ 2022–23 యాక్షన్‌ ప్లాన్‌ను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. 

ప్రతి బుధవారం ఎంఎస్‌ఎంఈ డే
జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించడంతోపాటు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్షించే విధంగా పలు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం జిల్లాల్లో ప్రతి బుధవారం ఎంఎస్‌ఎంఈ డేగా ప్రకటించడంతోపాటు ప్రతి నెలా పరిశ్రమలను అనుసంధానం చేసేలా సమావేశాలను నిర్వహించనున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో 25,000 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏడాదిలో 624 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లు నిర్వహించనుంది. అలాగే కొత్తగా పరిశ్రమలు పెట్టేవారికి గైడెన్స్‌ ఇవ్వడానికి 2,600 ప్రాజెక్టు రిపోర్టులను రూపొందింపజేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లడానికి మంగళవారం 20కిపైగా పారిశ్రామిక సంఘాలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ వర్చువల్‌ సమావేశం నిర్వహిస్తోంది.  

మరిన్ని వార్తలు