Hinduja Power: కష్టం.. ఆ కరెంట్‌తో 'ఎంతో నష్టం'

13 Jul, 2021 13:12 IST|Sakshi

సాక్షి, అమరావతి: హిందూజా నేషనల్‌ పవర్‌ కార్పొరేషన్‌ తీరును విద్యుత్‌ శాఖ తీవ్రస్థాయిలో ఎండగట్టింది. ఆ విద్యుత్‌ను తీసుకుంటే ప్రజలకు భారమేనని పునరుద్ఘాటించింది. సంస్థ ఇష్టానుసారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచేసి, దాన్ని ప్రజలపై రుద్దడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. దీనివల్ల కలిగే నష్టంపై ఇంధన శాఖ ప్రభుత్వానికి స్పష్టమైన నివేదిక కూడా సమర్పించింది. తాజాగా.. సోమవారం సుప్రీంకోర్టులోనూ హిందూజా పవర్‌పై ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాస్తవాలను న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీంతో కేసు విచారణను అత్యున్నత న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. 

వ్యతిరేకించిన వైఎస్సార్‌
విశాఖపట్నానికి సమీపంలో 1040 మెగావాట్ల సామర్థ్యంతో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన హిందూజా సంస్థకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవసరమైన తోడ్పాటునిచ్చింది. 1995లో డిస్కమ్‌లు ఈ సంస్థలతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం కూడా చేసుకున్నాయి. రూ.4,553 కోట్లతో ప్లాంట్‌ నిర్మాణం చేస్తామని హిందూజా అప్పట్లో పేర్కొంది. కానీ, అనుకున్న ప్రకారం హిందూజా ప్లాంట్‌ను పూర్తిచేయలేదు. పైగా డిస్కమ్‌లతో ఒప్పందం చేసుకున్న సంస్థ తన విద్యుత్‌ను ఓపెన్‌ యాక్సెస్‌లో అమ్ముకుంటానని 2007లో అప్పటి ప్రభుత్వానికి తెలిపింది. అయితే, అన్ని వసతులు తాము కల్పిస్తే ఇతరులకు విద్యుత్‌ అమ్మడాన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం వ్యతిరేకించింది.

రాష్ట్ర ప్రజలకే విద్యుత్‌ ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టింది. ఓపెన్‌ యాక్సెస్‌ బిడ్‌ను రద్దుచేసింది. ఇదిలా ఉంటే.. హిందూజా 2012లో నిర్మాణ వ్యయాన్ని అమాంతం పెంచేసింది. రూ.4,553 కోట్ల నుంచి రూ.5,630 కోట్లుగా పేర్కొంది. అయినప్పటికీ 2013లో అప్పటి ప్రభుత్వం ఆ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుంది. 1995లో జరిగిన పీపీఏని 2016లో పునరుద్ధరించారు. ఇదే సంవత్సరం జనవరి నుంచి హిందూజా విద్యుత్‌ అందిస్తోంది. నిజానికి అనుకున్న గడువులోగా విద్యుత్‌ ఇవ్వకపోవడంతో హిందూజా పీపీఏ రద్దయిందని విద్యుత్‌ శాఖ చెబుతోంది. కానీ, 2014లో హిందూజాతో టీడీపీ డీల్‌ కుదుర్చుకుందని, అందుకే ఈ రుణం తీర్చుకునేందుకే 2016లో పీపీఏ పునరుద్ధరించిందనే విమర్శలొచ్చాయి.

బెడిసికొట్టిన టీడీపీ ముడుపుల వ్యవహారం
ఇదిలా ఉంటే.. అడ్డగోలు లెక్కలతో హిందూజా సంస్థ ప్లాంట్‌ నిర్మాణ వ్యయాన్ని 2017లో మరోసారి రూ.8 వేల కోట్లకు పైగా పెంచేసింది. ఇందులో టీడీపీ పెద్దల హస్తం ఉందని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఈ వ్యవహారంపై విద్యుత్‌ నియంత్రణ మండలి విచారణ జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వ పెద్దలు ముడుపుల కోసం హిందూజాను డిమాండ్‌ చేయడం, అది కుదరకపోవడంతో వ్యవహారం బెడిసికొట్టిందని ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017 నుంచి విద్యుత్‌ తీసుకోవడం నిలిపివేశారు. అంతేకాక.. హిందూజా వ్యయం ఎక్కువగా ఉన్నందున పీపీఏ రద్దుచేయాలని అప్పటి ప్రభుత్వ ప్రోద్బలంతో ఏపీఈఆర్‌సీలో డిస్కమ్‌లు ఫిర్యాదు చేశాయి.

కమిషన్‌ దీన్ని సమర్థించింది. దీంతో హిందూజా ట్రిబ్యునల్‌కు వెళ్లింది. విద్యుత్‌ తీసుకోవాలంటూ ట్రిబ్యునల్‌ ఆదేశాలిచ్చింది. అప్పటి నుంచి ప్రతీ యూనిట్‌ రూ.3.82 చొప్పున (తాత్కాలిక ధర) ఏటా 2,832 మిలియన్‌ యూనిట్లను  డిస్కమ్‌లు తీసుకున్నాయి. 2020లో ఈ వ్యవహారాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హిందూజా విద్యుత్‌ ప్రజలకు నష్టమని భావించింది. ట్రిబ్యునల్‌ ఉత్తర్వులపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ విధానాలవల్ల హిందూజా వ్యవహారం ప్రజలకు భారమైందని.. దీన్ని అడ్డుకునేందుకు ప్రస్తుత ప్రభుత్వం అన్ని విధాలా కృషిచేస్తోందని, సుప్రీంకోర్టులోనూ బలంగా వాదనలు వినిపిస్తోందని విద్యుత్‌ వర్గాలు తెలిపాయి. 

మరిన్ని వార్తలు