మహిళల రక్షణకు రవాణా శాఖ ప్రత్యేక యాప్‌

6 Sep, 2020 05:31 IST|Sakshi

వచ్చే నెలలో యాప్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు స్వేచ్ఛగా ప్రయాణించేందుకు, వారికి పూర్తి భద్రత కల్పించేందుకు రవాణా శాఖ కొత్తగా యాప్‌ ఆధారిత ప్రాజెక్టు చేపట్టనుంది. ఆటోలు, క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు దీన్ని అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 శాతం భాగస్వామ్యంతో ప్రాజెక్టుకు నిధులు కేటాయించనున్నాయి. కేంద్రం తన వాటా నిధులు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే కేంద్రం తన వాటాగా రూ.56 కోట్ల వరకు నిధులు కేటాయించినా చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోలేదు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.135 కోట్లు్ల వెచ్చించనున్నాయి. 

ప్రాజెక్టు అమలు ఇలా..
► రాష్ట్రంలో ఆటోలు, క్యాబ్‌లలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ) బాక్స్‌లు అమరుస్తారు. వీటితోపాటు రవాణా శాఖ యాప్‌ను రూపొందిస్తుంది. 
► మహిళలకు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్‌ యాప్‌ నుంచి వాహనం నంబర్‌ పంపితే వాహనం ఎక్కడుందో గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (జీపీఎస్‌) ద్వారా ఇట్టే తెలుసుకుని పట్టుకోవచ్చు.  
► రాష్ట్రంలో 4.50 లక్షల ఆటోలు, లక్ష వరకు క్యాబ్‌లు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 
► ఈ వాహనాలకు దశల వారీగా ఐవోటీ బాక్సులు అమరుస్తారు. వీటిని రవాణా, పోలీస్‌ శాఖ సిబ్బంది పర్యవేక్షిస్తారు. 
► ఐవోటీ బాక్సులను వాహనాల ఇంజన్ల వద్ద అమరుస్తారు. ఆ తర్వాత డ్రైవర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ కార్డులు జారీ చేస్తారు. ఈ కార్డులను ఐవోటీ బాక్సుకు స్వైప్‌ చేస్తేనే ఆటో స్టార్ట్‌ అవుతుంది. 
► యాప్‌ వాడకం తెలియని మహిళలు ఐవోటీ బాక్స్‌కు ఉండే క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానమవుతుంది. 
► మహిళలకు ఇబ్బందులు ఎదురైతే ప్యానిక్‌ బటన్‌ నొక్కితే వెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందిస్తుంది. 
► పైలెట్‌ ప్రాజెక్టుగా తొలుత విజయవాడలో అమలుకు సన్నాహాలు చేస్తున్నారు. 
► ఇక్కడ ముందుగా 100 ఆటోల్లో ఐవోటీ బాక్సులు ఏర్పాటు చేసి త్వరలో ప్రాజెక్టు అమలు తీరుతెన్నులు పరిశీలించనున్నారు. 
► అక్టోబర్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీలు ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. 

ప్రతిష్టాత్మకంగా చేపడతాం
గతంలో అమలు చేయలేకపోయిన ఈ ప్రాజెక్టుపై మంత్రి పేర్ని నానితో ఇప్పటికే చర్చించాం. మహిళల భద్రత ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపడతాం.
– పీఎస్సార్‌ ఆంజనేయులు, రవాణా శాఖ కమిషనర్‌

మరిన్ని వార్తలు