శివారు భూములకూ నీటి నెలవు

6 May, 2021 03:42 IST|Sakshi
అకాస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్‌ పరికరం

చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించడంపై జల వనరుల శాఖ ప్రత్యేక దృష్టి 

అధునాతన ఏడీసీపీ పరికరంతో కాలువల ప్రవాహ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు 

డిజైన్‌ కంటే ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే పెంచేందుకు చర్యలు 

డిస్ట్రిబ్యూటరీలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు 

నీటి వృథాకు పూర్తిస్థాయిలో అడ్డుకట్టకు కసరత్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, చెరువులతోపాటు ఎత్తిపోతల పథకాల కింద ఉన్న ఆయకట్టు అంతటికీ సమృద్ధిగా సాగునీరు అందించడంపై జల వనరుల శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. డిజైన్‌ చేసిన మేరకు కాలువల ప్రవాహ సామర్థ్యం ఉందా.. తగ్గిందా.. అనే అంశాన్ని పరిశీలించేందుకు అధునాతన ఏడీసీపీ (అకాస్టిక్‌ డాప్లర్‌ కరెంట్‌ ప్రొఫైలర్‌) పరికరాన్ని వినియోగిస్తున్నారు. కాలువల ప్రవాహ సామర్థ్యం డిజైన్‌ చేసిన దానికంటే తక్కువగా ఉన్నట్టు తేలితే.. పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. ప్రధాన కాలువలు, ఉప కాలువలతోపాటు డి్రస్టిబ్యూటరీలకూ ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కడా) నేతృత్వంలో యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపడుతున్నారు. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. చివరి భూములకు సులభంగా నీళ్లందేలా చేస్తారు. 

ప్రవాహ సామర్థ్యం తగ్గడం వల్లే.. 
నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ ప్రవాహ సామర్థ్యం 11 వేల క్యూసెక్కులు. ఈ కాలువ కింద తెలంగాణ పరిధిలోని నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 6.57 లక్షల ఎకరాలు.. ఏపీలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3.82 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ కాలువను ఆధునికీకరించే పనులు కూడా పూర్తయ్యాయి. అయినా.. శివారు ఆయకట్టు భూములకు నీళ్లందించడం కష్టంగా మారింది. ప్రవాహ నష్టాలు 40 శాతం ఉన్నాయని తెలంగాణ వాదిస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ 27 శాతానికి మించవని ఏపీ స్పష్టం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాలువ ప్రవాహ సామర్థ్యాన్ని లెక్కించేందుకు ఈ ఏడాది ఏడీసీపీ పరికరాన్ని జల వనరుల శాఖ అధికారులు ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుకు చేరే నీటిని ఎప్పటికప్పుడు లెక్కించి.. ప్రవాహ సామర్థ్యం తక్కువగా ఉంటే డిజైన్‌ మేరకు ప్రవాహ సామర్థ్యాన్ని పెంచే పనులను చేపడతారు. తద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలతో పాటు శ్రీశైలం కుడి గట్టు కాలువ (ఎస్సార్బీసీ), తెలుగు గంగ, హెచ్చెల్సీ (తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్‌ (కర్నూలు–కడప కాలువ), వంశధార, తోటపల్లి వంటి భారీ ప్రాజెక్టులతోపాటు చెరువులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువల సామర్థ్యాన్ని కూడా ఇదే రీతిలో మదింపు చేసి.. డిజైన్‌ మేరకు ప్రవాహం ఉండేలా చర్యలు చేపట్టారు. 

ఖరీఫ్‌ మొదలయ్యేలోగా.. 
ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేలోగా భారీ, మధ్య, చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాల కింద కాలువలు, డి్రస్టిబ్యూటరీల మరమ్మతు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం కడాను ఆదేశించింది. దీంతో ఆయకట్టు వ్యవస్థపై సమగ్రంగా సర్వే చేసి, మరమ్మతులు చేపట్టాల్సిన పనులను గుర్తించాలని 13 జిల్లాల చీఫ్‌ ఇంజనీర్లకు కడా సూచించింది. ఇందుకు సంబంధించి చీఫ్‌ ఇంజనీర్లు పంపిన ప్రతిపాదనలను ఆమోదించిన కడా ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని నిర్దేశించింది. ప్రాజెక్టుల్లోకి నదీ జలాలు చేరేలోగా మరమ్మతులను పూర్తి చేయడానికి చర్యలు చేపట్టింది. తద్వారా నీటి వృథాకు పూర్తిగా అడ్డుకట్ట వేసి.. చివరి భూములకూ సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం చేస్తోంది.  

మరిన్ని వార్తలు