బాలల్లో సంకల్పబలం ఉండాలి

27 Apr, 2022 04:57 IST|Sakshi
జువెనైల్‌ హోంలో బాలల యోగక్షేమాలు తెలుసుకుంటున్న ఉష శ్రీచరణ్‌

మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉష శ్రీచరణ్‌ 

భవానీపురం (విజయవాడ పశ్చిమ): సమాజానికి మంచి చేయాలన్న సంకల్పబలం బాలల్లో ఉండాలని, అందుకోసం కష్టపడి చదువుకుని ఉన్నత స్థితికి చేరుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉష శ్రీచరణ్‌ ఆకాంక్షించారు. మంగళవారం ఆమె ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని ప్రభుత్వ బాలుర పరిశీలనా గృహాన్ని (జువెనైల్‌ హోం) సందర్శించారు. గృహంలో ఉన్న బాలలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విశాలమైన ప్రపంచంలో అనేక అవకాశాలున్నాయని, బెయిల్‌పై బయటకు వెళ్లిన తర్వాత సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని చెప్పారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బాలలు పెరిగిన వాతావరణం, అక్కడి పరిస్థితుల ప్రభావంతో జరిగిన చిన్నచిన్న ఘటనల కారణంగా ఇక్కడికి వచ్చారని అన్నారు. వారికి ఇక్కడ ఇస్తున్న కౌన్సెలింగ్‌తో చాలా మార్పు వచ్చిందన్నారు. 

బెయిల్‌ పూచీకత్తు అంశాన్ని జేజేసీ దృష్టికి తీసుకెళ్తా 
తమకు బెయిల్‌ మంజూరు అయినప్పటికీ పూచీకత్తు, నగదు జమ చేయలేని పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులున్న కారణంగా ఇంకా ఇక్కడే ఉండాల్సి వస్తుందని పలువురు బాలలు మంత్రి ముందు కన్నీటి పర్యంతమయ్యారు. దాంతో చలించిపోయిన ఆమె.. ఈ అంశాన్ని తాను జువెనైల్‌ జస్టిస్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తానని ధైర్యం చెప్పారు.  వారిని గురుకుల పాఠశాలలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చైల్డ్‌ లైన్‌ 1098 ఏర్పాటు చేసిన బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. బాలల సంస్కరణల సేవలు జాయింట్‌ డైరెక్టర్‌ బీడీవీ ప్రసాదమూర్తి, పరిశీలనా గృహం సూపరింటెండెంట్‌ టి.మధుసూధనరావు, మహిళా శిశు సంక్షేమ పీడీ ఉమాదేవి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు