Depression Symptoms: అటెన్షన్‌గా లేకపోతే టెన్షనే! బయటపడటం కష్టమా? డాక్టర్లు ఏమంటున్నారు?

13 Jan, 2023 19:07 IST|Sakshi

మారుతున్న కాలానికి అనుగుణంగా మానసిక జబ్బులకు గురవుతున్న     వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. చాలా మంది ప్రతి చిన్న విషయానికీ తీవ్రంగా కలత చెందుతున్నట్లు వైద్యుల పరిశీలనలతో వెల్లడింది. ఎప్పుడూ ముభావంగా ఉండటం, నలుగురితో కలవకపోవడం, పలకరించినా స్పందించకపోతుండటంతో సదరు వ్యక్తులను తీసుకొని బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రుల బాట పడుతున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురంలోని సర్వజనాసుపత్రికి మానసిక రుగ్మతలతో వస్తున్న వారిని పరిశీలించగా.. మానసిక ఒత్తిళ్లు, మానసిక రుగ్మతలు ఎదుర్కొంటున్న వారిలో మహిళల కంటే పురుషులే అధికంగా ఉన్నారు. సగటున 45 ఏళ్ల వయసు వారు ఎక్కువగా మానసిక రుగ్మతలకు గురవుతున్నట్లు తేలింది. చాలా మంది మహిళలు లేదా పురుషులు ఈ రుగ్మతలు ఉన్నట్లు కూడా తెలుసుకోలేక నిర్లక్ష్యం చేస్తుండటంతో తీవ్రత పెరిగాక వస్తున్నట్లు వైద్యులు వెల్లడిస్తున్నారు. 

ఆర్థిక, ఉద్యోగ సమస్యలతో.. 
మగవాళ్లు ఎందుకు ఎక్కువ మానసిక రుగ్మతల బారిన పడుతున్నారన్న విషయాన్ని వైద్యులు గుర్తించారు. ఆర్థిక, ఉద్యోగ సమస్యల్లో ఎక్కువ జోక్యం చేసుకోవడం, చెడు అలవాట్లకు బానిస కావడం ప్రధాన కారణాలని చెబుతున్నారు. అలాగే సరైన వ్యాయామం లేకపోవడంతో చిన్న చిన్న శారీరక సమస్యలకు కూడా మానసికంగా కుంగిపోతున్నారని తేల్చారు. జలుబు, దగ్గు లాంటివి ఎక్కువ రోజులు వేధించినా వారు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. 

చిన్న విషయానికే నిరాశ.. 
వాస్తవానికి చెడు అలవాట్లు ఆడవాళ్లలో చాలా తక్కువ. అయినా సరే నిరాశకు గురై మానసిక ఆందోళన చెందుతున్న ఆడవాళ్ల సంఖ్య కూడా ఎక్కువేనని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్‌ (నిరాశ)కు గురవున్నారు. మహిళలు చిన్న చిన్న కుటుంబ విషయాలకు కూడా తీవ్రంగా స్పందించడం, ఆలోచించడం వల్ల మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటు న్నారని వైద్యులు చెబుతున్నారు. ఉమ్మడి కుటుంబాల్లో ఇమడలేక.. ఒంటరితనాన్ని భరించలేక మానసిక ఆందోళన చెందుతున్నారనేది వైద్యుల అభిప్రాయం. 

పట్టించుకోకపోతే ముప్పే.. 
మానసిక రుగ్మతలను పట్టించుకోకపోయినా ముప్పేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి వల్ల కోపం, బాధ లాంటివి పెరిగిపోవడంతో అసిడిటీ, అల్సర్‌ లాంటి సాధారణ సమస్యల నుంచి గుండె, బీపీ, మధుమేహం, కిడ్నీ సమస్యల దాకా అనేక రకాల జబ్బులను       మోసుకొస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

రాయదుర్గానికి చెందిన 42 ఏళ్ల యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌     ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్‌ 21వ తేదీన అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వచ్చారు. వైద్యులు పరిశీలించారు. అతను పనిచేసే ఆఫీసులో తీవ్ర ఒత్తిడి ఉంది. బాస్‌ నిత్యం వేధిస్తున్నారన్న భావన నెలకొంది. దీంతో రోజు రోజుకూ మానసికంగా కుంగిపోయి సొంతవూరికి వచ్చేశారని వైద్యులు తేల్చారు. 

ఉరవకొండకు చెందిన 36 ఏళ్ల మహిళ కొంతకాలంగా ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏమి చెప్పినా ఆలకించే స్థితి దాటిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు అనంతపురంలోని ఓ సైకియాట్రిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లారు. గత ఏడాది         ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో కూతురుకు తక్కువ మార్కులు రావడంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు డాక్టర్‌ తెలిపారు. 

బాధితులు ఎక్కువవుతున్నారు 
ఫలానా మానసిక రుగ్మత అందరికీ ఉండాలని లేదు. మగవాళ్లలో స్కిజోఫినియా ఎక్కువగా ఉంటుంది. అదే ఆడవాళ్ల విషయంలో డిప్రెషన్‌ ఎక్కువ. సోషియల్‌ ఎలిమెంట్స్‌ అంటే సామాజిక కారణాలు.. కుటుంబ,  ఆర్థిక సమస్యలు వంటివి ఒక కారణం. చిన్న చిన్న సమస్యలకు కూడా కొందరు కుంగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరికి కౌన్సిలింగ్‌ కావాలి. 
– డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు, జాతీయ హెల్త్‌మిషన్‌  

కుటుంబ వ్యవస్థ దెబ్బతింటోంది 
కుటుంబ వ్యవస్థ బాగా దెబ్బతింటోంది ప్రధానంగా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా రియాక్ట్‌ అవుతున్నారు. పిల్లలకు చదువులో మంచి మార్కులు రాకపోయిన, తమ గోల్‌ సాధించకపోయిన ఇలా ప్రతి అంశానికి సంబంధించి ఒత్తిడి ఉంటోంది. అన్ని వయస్సుల వారు ఒత్తిడి బారిన పడుతున్నారు.అలాగే వ్యసనాలకు అలవాటు పడటం, కుటుంబంలో ఒకరిపై ఒకరు ఆ«ధిపత్యం వంటి ఎన్నో ఒత్తిడికి కారణమవుతున్నాయి. సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నాం. 
– డాక్టర్‌ అనిల్‌కుమార్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 

మానసిక ఒత్తిడికి చెక్‌పెట్టండిలా... 
► కనీసం మనిషి రోజుకు 7 నుంచి 8 గంటల పాటు నిద్ర పోవాలి. 
► కచ్చితంగా రోజూ వ్యాయామం చేయాలి. 45 నిముషాల పాటు  వాకింగ్, రన్నింగ్‌ చేసినా ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు.  
► యోగా, ధ్యానం చేస్తూ ఒత్తిడిని జయించవచ్చు. 
► తీసుకునే ఆహారం కూడా ఒత్తిడిని తగ్గిస్తాయని వైద్యులు చెబుతున్నారు. తాజా కూరగాయలు, పండ్లు, చేపలు, చిరు ధాన్యాల్లో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, పొటీన్స్, విటమిన్స్‌తో పాటు మినరల్స్‌ ఉంటాయి. ఈ ఆహారం తీసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.  

మరిన్ని వార్తలు