అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి

26 Nov, 2020 21:48 IST|Sakshi

నివర్‌ తుపాన్‌ ప్రభావంపై జిల్లాల అధికారులతో మంత్రుల సమీక్ష 

సాక్షి, పశ్చిమగోదావరి: నివర్ తుపాను ప్రభావంతో జిల్లా యంత్రాంగాన్ని డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అప్రమత్తం చేశారు. గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కుండపోత వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని, జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా వైద్య బృందాలు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. కాజ్‌ల వద్ద పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. పునరావాస చర్యలు, భోజన సదుపాయం, వైద్య సహాయం విషయంలో అధికారులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అవసరమైన ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. (చదవండి: ఆ విషయాన్ని ప్రజలు గమనించాలి: సజ్జల)

అధికారులు అందుబాటులో ఉండాలి: మంత్రి అనిల్‌
నెల్లూరు: ఇరిగేషన్‌ శాఖ అధికారులతో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావంతో చెరువులు గండి పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అధికారులందరూ అందుబాటులో ఉండాలని మంత్రి అనిల్‌ ఆదేశించారు. (చదవండి: శ్రీవారి మెట్టు మార్గం మూసివేత

ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి: మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు: జిల్లా అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను సహాయక చర్యలపై సమీక్ష జరిపారు. నివర్‌ తుపాను కారణంగా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. చెరువులు, జలాశయాల్లో నీటినిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ముంపు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, వైద్యంతోపాటు అన్ని వసతులు కల్పించాలని, అన్ని మండల కేంద్రాల్లోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు.

మరిన్ని వార్తలు