కృష్ణ గొప్ప నటుడే కాదు.. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి: డిప్యూటీ సీఎం

15 Nov, 2022 15:45 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఘట్టమనేని కృష్ణ గొప్ప నటుడే కాక ఉన్నత వ్యక్తిత్వం, విలువలు ఉన్న మనిషి అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. సంపాదనతో నిమిత్తం లేకుండా సమాజ హితం కోసం ఆయన అనేక సందేశాత్మక చిత్రాలు తీశారన్నారు. డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా ఆయనకున్న గుర్తింపు సినిమాలకే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అలాగే ఉండేవారని తెలిపారు.

ఈ మేరకు మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటి గొప్పవారినైనా ఎదిరించి నిలబడే మనస్తత్వం గల నిజాయితీపరుడు. పశ్చిమగోదావరి జిల్లాకు ఆయనకు విడదీయరాని  అనుబంధం ఉంది. ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో ఆయన బిఎస్సీ చదువుకున్నారు. 1989 ప్రాంతంలో ఏలూరు ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఆయన పని చేసిన రెండేళ్లలోపు కాలంలోనే ముంపు బాధిత రైతులకు ఎంతో సహాయం చేశారు. 

చెరకు రైతులకు సకాలంలో పర్మిట్లు ఇప్పించేందుకు కృషి చేశారు. అలాగే పశ్చిమ, కృష్ణా డెల్టాల మధ్య ఉన్న కొల్లేరు సరస్సు ప్రత్యేకత, అక్కడి ప్రజల జీవన విధానం, కష్టసుఖాలు తెలియజేబుతూ "కొల్లేటి కాపురం" అనే సినిమా తీశారు. అలాగే మన జిల్లావాసి అయిన స్వతంత్ర సమరయోధుడు, మన్యం వీరుడు "అల్లూరి సీతారామరాజు" సినిమా తీయడం ద్వారా ఆయన గొప్పదనాన్ని ఆంధ్రదేశానికి చాటి చెప్పడమే కాకుండా కృష్ణ తన దేశభక్తిని చాటుకున్నారు.

ఆయన రాజకీయలలో క్రియాశీలక పాత్ర పోషించకపోయినా అమరులైన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, రాజీవ్ గాంధీకి ఈయన ఎంతో సన్నిహితులుగా ఉండేవారు. అలాగే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి గారికి కూడా కృష్ణ గారి కుటుంబంతో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎంతో చరిత్ర కలిగిన కృష్ణ గారు మన మధ్యన లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. ఆయన తనయులు మహేష్ బాబుకి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు.

చదవండి: (కృష్ణ పార్థివదేహం వద్ద బోరున విలపించిన మోహన్ బాబు)

మరిన్ని వార్తలు