ఏపీలో టెస్టులు భేష్‌ : బ్రిటీష్‌ హైకమిషనర్‌

7 Aug, 2020 18:02 IST|Sakshi

ఏపీలో టెస్టులు, ట్రేసింగ్‌ భేష్‌.. బ్రిటిష్‌ హైకమిషనర్‌ ప్రశంస

సీఎం వైఎస్‌ జగన్‌తో వీడియో కాన్ఫరెన్స్‌

అంబులెన్స్‌ల నిర్వహణలో ఇంగ్లండ్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ భాగస్వామ్యం

సాక్షి, అమరావతి : కరోనా నివారణా చర్యలు, వైద్య సేవలు, పరిశోధనలు, సాంకేతిక అంశాలపై బ్రిటన్‌ దౌత్యాధికారులతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో ఇండియాలో బ్రిటన్ తాత్కాలిక హై కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జాన్ థాంప్సన్, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల బ్రిటిష్‌ డిప్యూటీ హై కమిషనర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌లు పాల్గొన్నారు. కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను జాన్ థాంప్సన్ ప్రశంసించారు. (ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ ఏర్పాటు)

జాన్‌ థాంప్సన్‌ ఏమన్నారంటే..
‘కోవిడ్‌ లాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచంలోని దేశాలు కలిసిపనిచేయాల్సిన అవసరం ఉంది. భారత్‌ – యూకేలు రెండూ కూడా కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో కలిసి పనిచేస్తున్నాయి. పరిశోధనలు, వ్యాక్సిన్‌ తయారీ, ఔషధాల తయారీలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. వ్యాక్సిన్‌ యూకేలో తయారవుతోంది. భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తిచేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏపీలో ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం.

భారీగా టెస్టులు చేయడంలో, పాజిటివ్‌ కేసులను గుర్తించండంలో ఆంధ్రప్రదేశ్‌ విశేషంగా పనిచేస్తోంది. అలాగే కరోనా మరణాల రేటు పూర్తిగా అదుపులో ఉండడం ప్రశంసనీయం. టెలీమెడిసిన్‌ లాంటి కొత్త విధానాలు ముందుకు తీసుకెళ్తున్నారు. వైద్య, విద్య, ఆరోగ్య రంగాల్లో ఏపీ ప్రభుత్వం మంచి చర్యలను తీసుకుంటోంది. ఏపీ మెడ్‌ టెక్‌జోన్‌తో ఇటీవలే అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం. కరోనా నివారణకోసం వాడే వైద్య పరికరాల తయారీకి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. ఈ విషయంలో స్టార్టప్‌ కంపెనీలను యూకే ప్రోత్సహిస్తుంది. కరోనా విపత్తును ఎదుర్కోనే ప్రక్రియలో కలిసి ముందుకు సాగడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంగ్లండ్‌కు చెందిన నేషనల్‌ హెల్త్‌మిషన్‌ భాగస్వామంతో 108, 104 లాంటి అంబులెన్స్‌ల నిర్వహణలో ఉత్తమ పద్ధతులు, టెక్నాలజీలను ఉపయోగించే అవకాశం ఉంటుంది’ అని జాన్‌ థాంప్సన్‌ పేర్కొన్నారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక బ్రిటన్‌ రావాల్సిందిగా వైఎస్‌ జగన్‌ను బ్రిటిష్‌ హైకమిషనర్‌ ఆహ్వానించారు. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225)

ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం : వైఎస్‌ జగన్‌
‘రాష్ట్రంలో కోవిడ్‌ టెస్టులు పెద్ద ఎత్తున చేస్తున్నాం. సగటున రోజుకు 62వేల వరకూ పరీక్షలు చేస్తున్నాం. 90శాతం పరీక్షలు కోవిడ్‌ క్లస్టర్లలోనే చేస్తున్నాం. దీనివల్ల కేసులు బాగా నమోదవుతున్నాయి. కోవిడ్‌ సోకిన వారిని వేగంగా గుర్తించి, వారిని ఐసోలేట్‌ చేయడానికి, వైద్యం అదించండానికి తద్వారా మరణాల రేటు తగించడానికి ప్రయత్నిస్తున్నాం. ఏపీలో కరోనా మరణాల రేటు దేశం సగటుతో పోలిస్తే చాలా తక్కువ. మరణాల రేటు దేశంలో 2.07 శాతం, ఏపీలో 0.89 శాతంగా ఉంది. నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం.

హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు అన్ని రకాల పెద్ద ఆస్పత్రులు, వైద్య సేవలు అక్కడే అభివృద్ది చెందాయి. అలాంటి సదుపాయాలు ఇక్కడ లేవు. మేం అధికారంలోకి వచ్చేసరికి ప్రభుత్వ ఆరోగ్య రంగంలో వైద్య సదుపాయాలు అంతంత మాత్రమే. ప్రస్తుతం ప్రజారోగ్య రంగంపై బాగా దృష్టిపెట్టాం. నాడు–నేడు ద్వారా ఆస్పత్రులను అభివృద్ధిచేస్తున్నాం. 16 కొత్త మెడికల్‌ కాలేజీలను, ఆస్పత్రులను తీసుకువస్తున్నాం. గ్రామ, వార్డుల వారీగా క్లినిక్స్‌ నిర్మిస్తున్నాం. ప్రతి పీహెచ్‌సీ, సీహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రి, జిల్లా ఆస్పత్రి, బోధనాసుపత్రులను బాగా అభివృద్ధిచేయబోతున్నాం. జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేస్తున్నాం. (టెలి మెడిసిన్‌ సేవలపై ఆరా తీయండి: సీఎం జగన్‌)

కోవిడ్‌కు వ్యాక్సిన్‌ వచ్చేంతవరకూ మనం దాంతో కలిసి బతకాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఈలోగా మరణాలు సంభవించకుండా తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. ఆక్స్‌ఫర్డ్‌ తయారుచేసిన వ్యాక్సిన్‌ను డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బ్రిటన్‌ సహకారం మారాష్ట్రానికి చాలా అవసరం ఉంది. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా అందిస్తాం. ఆస్పత్రులకు ఆలస్యంగా వస్తున్నందువల్లే కోవిడ్‌ మరణాలు సంభవిస్తున్నాయి. ఎంత త్వరగా వస్తే, అంతగామరణాలు తగ్గించవచ్చు. 10వేలకుపైగా రెమిడెసివర్‌ ఇంజక్షన్లు వాడి చాలా మందికి మెరుగైన వైద్యాన్ని అందించాం. త్వరగా ఆస్పత్రికి రావడం అన్నది చాలా ముఖ్యం’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు