Roger Cook: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది

17 Jul, 2022 04:30 IST|Sakshi

కొత్త పోర్టులతో అనుసంధానం నిజంగా అద్భుతం

మౌలిక సదుపాయాల కల్పనలో సీఎం జగన్‌ అద్భుతంగా పనిచేస్తున్నారు

మరోసారి ఏపీకి వచ్చి ఆయనతో భేటీ అవుతా

ముంబై తర్వాత వైజాగ్‌లో టూరిజం అభివృద్ధి అవకాశాలు అపారం

‘సాక్షి’తో పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్‌ రోజర్‌ కుక్‌

సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామికాభివృద్ధికి అనుగుణంగా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని చూస్తే అసూయగా ఉందని పశ్చిమ ఆస్ట్రేలియా డిప్యూటీ ప్రీమియర్‌.. ట్రేడ్, టూరిజం, సైన్స్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి రోజర్‌ కుక్‌ వ్యాఖ్యానించారు. విశాఖలో నిర్వహించిన ‘ఆంధ్రప్రదేశ్‌–పశ్చిమ ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుక్‌ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..

పశ్చిమ ఆస్ట్రేలియాకు ఏపీ అతిపెద్ద భాగస్వామి
మాకు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశం. ఏ ఇతర దేశాలతోనూ ఇంత పెద్ద మొత్తంలో ఒప్పందాలు, పెట్టుబడులకు ముందుకు వెళ్లలేదు. భారత్‌లో అతిపెద్ద భాగస్వామి రాష్ట్రంగా ఏపీ ఉంది. భారత్‌లోని 70కి పైగా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలతో పరస్పర సహకారం అందిపుచ్చుకుంటున్నాం.

ముంబై తర్వాత వైజాగ్‌..
పది రోజుల పర్యటనలో భాగంగా మా బృందంతో కలిసి విశాఖపట్నం వచ్చాం. ఇక్కడకు నేను రావడం ఇదే మొదటిసారి. ఢిల్లీ, ముంబై నగరాల్లో పర్యటించాం. తర్వాత వైజాగ్‌ వచ్చాం. ఇది చాలా అద్భుతమైన నగరం. ముంబై తర్వాత పర్యాటక రంగం అభివృద్ధికి ఎక్కువ అవకాశాలున్న నగరమిదే. ఇక్కడ టూరిజంలో పెట్టుబడులకు అవకాశాలు అపారం. భారత్‌లో ఒక్కో నగరం ఒక్కో ప్రత్యేకతని సంతరించుకుంది. ఇందులో వైజాగ్‌ మరింత ప్రత్యేకంగా ఉందనడంలో ఎలాంటి సందేహంలేదు.

రెండు నగరాల కంటే మిన్నగా..
ముందుగా ఢిల్లీలో సదస్సు నిర్వహించినప్పుడు ఎక్కువగా పశ్చిమ ఆస్ట్రేలియా, ఢిల్లీ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ముంబైలో టూరిజంపైనే సింహభాగం చర్చించాం. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక్క రంగంపైనే దృష్టిసారించలేదు. ఢిల్లీ, ముంబై కంటే మిన్నగా సదస్సు జరిగింది. రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలపై మంత్రులు, ప్రభుత్వాధికారులు చక్కగా వివరించారు. 

పారిశ్రామిక అభివృద్ధి బాగుంది..
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధి చాలా బాగుంది. పశ్చిమ ఆస్ట్రేలియా, ఏపీకి మధ్య వివిధ రంగాల్లో సారూప్యతలు ఉన్నాయి. ముఖ్యంగా ఎనర్జీ రంగంలో ఇరు ప్రాంతాలు ఒకేలా వ్యవహరిస్తున్నాయి. అందుకే ఎనర్జీ రంగంతో పాటు అంతర్జాతీయ విద్య, సముద్ర ఉత్పత్తులు, వ్యవసాయం మొదలైన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలిసి నడవాలని నిర్ణయించాం.

సీఎం జగన్‌  ఆలోచనలు అద్భుతం
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా కచ్చితంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు లేదా ఫిషింగ్‌ హార్బర్‌ ఏర్పాటుచేయాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలు అసూయ పుట్టించేవిగా ఉన్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విషయంలో భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొత్త పోర్టుల అనుసంధానం నిజంగా అద్భుతమైన నిర్ణయం. ముఖ్యమంత్రిని తమ బృందం కలవాలని అనుకున్నాం. వరదల కారణంగా ఆయన బిజీగా ఉన్నట్లు చెప్పారు. అందుకే త్వరలోనే మరోసారి ఏపీలో పర్యటిస్తా. సీఎం జగన్‌తో భేటీ అవుతాను. 

మరిన్ని వార్తలు