నా పులులతోపాటే నేనూ! 

9 Mar, 2022 04:29 IST|Sakshi
గిరికుమార్‌ పెంచుతున్న పులులు ఇవే..

నాతో పాటు వాటికీ అనుమతివ్వాలి 

అలా అయితేనే ఇండియాకు వస్తా.. 

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వైద్యుడి కోరిక 

తణుకుకు చెందిన డాక్టర్‌ గిరికుమార్‌  

జాగ్వార్, పాంథర్‌తోపాటు మూడు కుక్కలకు సంరక్షణ 

తణుకు:  ఓ పక్క ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. కళ్లెదుటే బాంబుల వర్షం.. ప్రాణాలు అరచేత పట్టుకుని గడుపుతున్న జనం.. ఈ పరిస్థితుల్లో రోజురోజుకూ అక్కడి పరిస్థితులు అధ్వానంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడకు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్లిన భారతీయులంతా స్వదేశానికి చేరుకుంటున్నప్పటికీ.. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన డాక్టర్‌ గిరిష్‌కుమార్‌ పాటిల్‌ మాత్రం స్వదేశానికి వచ్చేందుకు ససేమిరా అంటున్నారు. అందుకు కారణం.. తాను ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటున్న వన్యప్రాణులను వదిలి రాలేకపోవడమే. తణుకు పట్టణానికి చెందిన డాక్టర్‌ గిరికుమార్‌ 2007లో ఉక్రెయిన్‌లో మెడిసిన్‌ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక సెవెరోగోనెట్కస్‌ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌ వద్ద అసిస్టెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తున్నారు.

జంతువులంటే ఇష్టపడే గిరికుమార్‌ దాదాపు రెండేళ్ల క్రితం ఒక జూలో గాయపడిన జాగ్వార్‌ (మచ్చలు కలిగిన చిరుతపులి)ను అధికారుల అనుమతితో దత్తత తీసుకున్నారు. దీనికి తోడుగా అర్నెళ్ల క్రితం బ్లాక్‌ పాంథర్‌ (నల్ల చిరుతపులి)ను పెంచుతున్నారు. ఇటాలియన్‌ మెష్టిఫ్‌ సంతతికి చెందిన మరో మూడు కుక్కలనూ పెంచుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక ఆరు రోజుల పాటు జంతువులతోపాటు బంకర్‌లో దాక్కున్న ఆయన ప్రస్తుతం తన ఇంటి వద్ద బేస్‌మెంట్‌లో ఉంటున్నారు. తాను నివాసం ఉంటున్న ప్రాంతాలను రష్యా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో ప్రస్తుతం కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేకపోగా నాలుగైదు రోజులకు సరిపడా ఆహారం మాత్రం అందుబాటులో ఉన్నట్లు గిరికుమార్‌ ‘సాక్షి’తో చెప్పారు.  

ప్రముఖుల ఫోన్లకు బదులేమిచ్చారంటే.. 
గిరికుమార్‌తో ఇటీవల ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. పీఎం కార్యాలయం ప్రతినిధులతోపాటు మాజీ సీఎం చంద్రబాబు సైతం గిరికుమార్‌తో సంప్రదింపులు చేశారు. అయితే.. తాను పెంచుకుంటున్న జంతువులకు లైసెన్సులు ఇచ్చి.. ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్సీ ప్రాంత సమీపంలోని గోకవరం వద్ద సఫారీ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలా అయితేనే తాను స్వదేశానికి రావడానికి సిద్ధంగా ఉంటానని స్పష్టం చేసి.. జంతువులపై తనకున్న ప్రేమను చాటుకున్నారు.  

మరిన్ని వార్తలు