37 ఎకరాల్లో గంజాయి తోటలు ధ్వంసం

10 Nov, 2021 04:51 IST|Sakshi
డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న గిరిజనులు

ఏజెన్సీలో కొనసాగుతున్న గంజాయి నిర్మూలన కార్యక్రమాలు 

గూడెంకొత్తవీధి/డుంబ్రిగుడ/కొయ్యూరు: విశాఖ ఏజెన్సీలో మంగళవారం 37 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, జి.కె.వీధి పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా గంజాయి మొక్కలను ధ్వంసం చేశారు. జర్రెల పంచాయతీలోని పలు గ్రామాల్లో సర్పంచ్‌ వీరోజి నాగరాజు ఆధ్వర్యంలో సుమారు 5 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు. జి.కె.వీధి పంచాయతీలోని బి.కొత్తూరు, డి.కొత్తూరు గ్రామాల పరిధిలో జి.కె.వీధి సీఐ అశోక్‌కుమార్, ఎస్‌ఐ షమీర్‌ ఆధ్వర్యంలో 20 ఎకరాలలో గంజాయి తోటలను ధ్వంసం చేసి మొక్కలకు నిప్పంటించారు. చింతపల్లి మండలంలోని అన్నవరం స్టేషన్‌ పరిధిలో గచ్చిపల్లి సమీపంలోని సుమారు 6 ఎకరాల్లోని గంజాయి తోటలను ఎస్‌ఐ ప్రశాంత్‌కుమార్‌ సమక్షంలో ధ్వంసం చేశారు. డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ కొంతుగుడ గ్రామంలో ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో 6 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

46 కిలోల గంజాయి పట్టివేత 
గొలుగొండ ఎస్‌ఈబీ సీఐ రాజారావు ఆధ్వర్యంలో మంగళవారం డౌనూరు పంచాయతీ తురబాలగెడ్డ వద్ద 46 కిలోల గంజాయిని పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లి ప్రాంతం నుంచి టాటా నానో కారులో గంజాయి ప్యాకెట్లను తీసుకెళ్తుండగా ఎస్‌ఈబీ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ రూ.లక్ష వరకు ఉంటుంది. కారు, ద్విచక్ర వాహనం, నాలుగు ఫోన్లు, రూ.1,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. డుంబ్రిగుడకు చెందిన బి.రాజారావును, పాములవాకకు చెందిన సీహెచ్‌ నానిబాబు, హుకుంపేటకు చెందిన జి.రంగారావు, వి.రాజులను అరెస్టు చేశామని సీఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు