Devaragattu Bunny Festival: భక్తులు కర్రలతో ఎందుకొస్తారంటే..?

15 Oct, 2021 14:47 IST|Sakshi
దేవరగట్టుకు వెళ్లే దారి

జైత్రయాత్రకు సర్వం సిద్ధం

నేడు దేవరగట్టులో బన్ని ఉత్సవం

భారీగా మొహరించిన పోలీసులు

సీసీ, డ్రోన్‌ కెమెరాల నిఘా

హొళగుంద: బన్ని(కర్రల సమరానికి) ఉత్సవానికి దేవరగట్టు సిద్ధమైంది. విజయదశమి పండుగను పురస్కరించుకుని శుక్రవారం అర్ధరాత్రి మాత మాళమ్మకు, మల్లేశ్వరునికి కల్యాణం నిర్వహించనున్నారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగనుంది. భక్తులు డిర్ర్‌..ర్ర్‌...గోపరక్‌...బహుపరాక్‌ అంటూ కర్రల సమరం నిర్వహించనున్నారు. వేడుకలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలిరానున్నారు. కరోనా కారణంగా ఈ ఏడాది గట్టుకు వాహనాలను అనుమతించడం లేదు. ఉత్సవంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా  1,350 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చదవండి: దసరా పండుగ కళ వచ్చిందయ్యో

అల్లర్లకు పాల్పడే వారిని గుర్తించడానికి వీలుగా 120కు పైగా సీసీ కెమెరాలు అమర్చారు. అలాగే నాలుగు   డ్రోన్‌ కెమెరాలను వినియోగించనున్నారు. వేడుకల్లో గాయపడే భక్తులకు దేవరగట్టులోని ఓ భవనంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆధ్వర్యంలో 10 మంది డాక్టర్లు,  100 మంది వైద్య సిబ్బంది సేవలు అందించనున్నారు. మంచాలు, మెడిసిన్స్, ఇతర అత్యవసర చికిత్సకు కావల్సిన మందులు, పరికరాలతో పాటు 108, 104 అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచారు.  

ఉత్సవం జరుగుతుందిలా.. 
దేవరగట్టు పరిసర గ్రామాలు నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు చెరువుకట్ట (డొళ్లిన బండే)వద్దకు చేరి వర్గ వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేకుండా కలిసికట్టుగా ఉత్సవాన్ని జరుపుకుందామని పాలబాస తీసుకుంటారు. కల్యాణోత్సవానికి వస్తున్నట్లు సూచనగా గ్రామపెద్దలు పోలీసులకు బండారాన్ని ఇస్తారు. అనంతరం బాణసంచా పేల్చి కర్రలు, అగ్గి కాగడాలు చేతపట్టుకొని మేళతాళాలతో కాడప్ప మఠానికి చేరుకుంటారు. అక్కడున్న మల్లేశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని కొండపైకి  తీసుకెళ్తారు. ఆలయంలో మాత మాళమ్మ, మల్లేశ్వరునికి కల్యాణోత్సవం జరిపిస్తారు. అనంతరం జైత్రయాత్ర కొనసాగుతుంది. మొగలాయిలో భక్తుల చేతుల్లో ఉన్న కర్రలు తగిలి , పైకి విసిరిన అగ్గి కాగడాలు మీద పడి  చాలా మంది గాయపడ్తారు. గాయపడినవారికి స్వామివారికి చల్లే పసుపు (బండారం) అంటిస్తారు. అనంతరం జైత్రయాత్ర ముల్లబండ, పాదాలగట్టు, రక్షపడికి చేరుకుంటుంది.
చదవండి: ఆనందోత్సవాల ‘ఆసరా’

కొండపై ఆలయం 

రక్త సంతర్పణ.. 
ఉత్సవ విగ్రహాలు రక్షపడికి చేరుకున్నాక..అక్కడున్న రెండు రాతి గుండ్లకు కంచాభీరా వంశానికి చెందిన గొరువయ్య ఐదు చుక్కల రక్తాన్ని సమర్పిస్తాడు. బసవన్న గుడి వద్ద ప్రధాన అర్చకుడు గిరిస్వామి భక్తులకు భవిష్యవాణి వినిపిస్తారు. విగ్రహాలు సింహాసన  కట్టకు చేరుకోవడంతో జైత్రయాత్ర ముగుస్తుంది.

మంచి జరుగుతుందనే ఉద్దేశంతో..
పురాతన కాలంలో విష పురుగులు, జంతువుల బారి నుంచి రక్షణ పొందేందుకు దివిటీలు, కట్టెలతో భక్తులు కొండపైకి వెళ్లేవారు. మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు తమ చేతిలో ఉన్న కర్రలతో దేవుడి విగ్రహాలను తాకేందుకు పోటీ పడతారు. ఈ సమయంలో కర్రలు తగులుకుని శబ్దం వస్తుంది. నాటుసారా, మద్యం సేవించిన వారి చేతిలోని కర్రలు స్వాధీనంలో లేకుండా మరొకరికి తగిలి గాయాలవుతాయి. గతంలో కొందరు ఉద్దేశ పూర్వకంగా గుంపులో కొట్టుకునేందుకు ప్రయత్నించేవారు. ఇది రక్తపాతానికి కారణమయ్యేది. అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించడంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. సంప్రదాయం ప్రకారం ఉత్సవం జరుపుకుంటున్నారు. 

144 సెక్షన్‌ అమలు 
వేడుకల్లో భాగంగా 19వ తేదీ వరకు దేవరగట్టుతో పాటు పరిసర గ్రామాల్లో 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తక్కువ సంఖ్యలో భక్తులు హాజరుకావాలి. ఇప్పటికే 150 మందిపై పోలీసులు బైండోవర్, ఇతర కేసులు నమోదు చేశారు. 
– శేషఫణీంద్ర, తహసీల్దార్, హొళగుంద

అన్ని ఏర్పాట్లు చేశాం 
బన్ని ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నాం. తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నాం. కొత్తపేట రోడ్డును బాగు చేయించాం. ఉత్సవాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా కోవిడ్‌ నిబంధనలు పాటించాలి.
 – గుమ్మనూరు శ్రీనివాసులు, దేవరగట్టు ఆలయ కమిటీ చైర్మన్‌   

మరిన్ని వార్తలు