రూ.123 కోట్లతో 13 ఎంఎస్‌ఈ క్లస్టర్ల అభివృద్ధి

2 May, 2022 04:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఏపీలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా ఎంఎస్‌ఈ క్లస్టర్ల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. మైక్రో, స్మాల్‌ ఎంటర్‌ప్రైజైస్‌ క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ పోగ్రాం (ఎంఎస్‌ఈ–సీడీపీ) కింద కొత్తగా 13 క్లస్టర్లతతో పాటు ఏడు ఫ్యాక్టరీ షెడ్లు నిర్మించనుంది. సుమారు రూ.123.07 కోట్లతో 13 ఎంఎస్‌ఈ క్లస్టర్లను అభివృద్ధి చేయడానికి సంబంధించిన ప్రాజెక్టు నివేదికలను తయారుచేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్లు ఏపీఐఐసీ అధికారులు తెలిపారు. 2,111.59 ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఈ క్లస్టర్లకు సంబంధించిన ప్రతిపాదనలను న్యూఢిల్లీలోని ఎంఎస్‌ఎంఈ డీసీ కార్యాలయానికి పంపినట్లు తెలిపారు.

ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.33.66 కోట్లు సమకూర్చనుండగా, కేంద్రం గ్రాంట్‌ రూపంలో రూ.89.41 కోట్లు కేటాయిస్తుంది. హిందూపురం గ్రోత్‌ సెంటర్, గుంటూరు ఆటోనగర్, మచిలీపట్నం జ్యూవెలరీ పార్కు, కర్నూలు పారిశ్రామిక పార్కు, కడప, నడికుడి పారిశ్రామికపార్కులు, కానూరు, ఒంగోలు ఆటోనగర్‌లు, నెల్లిమర్ల, తణుకు, గాజులమండ్యం,రాయచోటి, తిరుపతి పారిశ్రామికపార్కుల్లో ఈ ఎంఎస్‌ఈ–సీడీపీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు.

ఈ పథకం కింద రూ.11 కోట్లతో కానూరు, ఆమదాలవలస ప్రాజెక్టులను పూర్తిచేయగా, రూ.74.72 కోట్లతో మరో 6 ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నారు. యూనిట్లు తక్షణం ఉత్పత్తిని ప్రారంభించుకునే విధంగా 29.14 ఎకరాల విస్తీర్ణంలో రూ.88.62 కోట్లతో ఏడుచోట్ల ఫ్లాటెడ్‌ ప్యాక్టరీ షెడ్లను నిర్మించనున్నారు. ఆత్మకూరు, మల్లవల్లి, పలమనేరు పారిశ్రామికపార్కులతో పాటు తిరుపతి–1, తిరుపతి–2, కొప్పర్తి ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్లతో పాటు అచ్యుతాపురం నాన్‌సెజ్‌ ఏరియాలో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో రూ.17.97 కోట్లు ప్రభుత్వం సమకూర్చనుండగా మిగిలినది కేంద్రం గ్రాంట్‌ రూపంలో ఇస్తుంది. వీటి డీపీఆర్‌లను కేంద్రానికి పంపామని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు.  

మరిన్ని వార్తలు