అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు

27 Jan, 2021 03:42 IST|Sakshi
పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం

అసెంబ్లీ వద్ద స్పీకర్, శాసనమండలి వద్ద చైర్మన్‌ పతాకావిష్కరణ

సాక్షి, అమరావతి/ఇబ్రహీంపట్నం: రాష్ట్రం నలుమూలల మంగళవారం గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాల్ని ఆవిష్కరించారు. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్‌ తమ్మినేని సీతారాం జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతరాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు. సామాజిక న్యాయం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా సీఎం వైఎస్‌ జగన్, ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారని చెప్పారు. అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, సహాయ కార్యదర్శులు, ఉద్యోగులు పాల్గొన్నారు. 

యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలి
శాసనమండలి ప్రాంగణంలో మండలి చైర్మన్‌ ఎంఏ షరీఫ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధులు అందించిన స్ఫూర్తితో యువత దేశాభివృద్ధికి పునరంకితం కావాలన్నారు.  
గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న శాసనమండలి చైర్మన్‌ షరీఫ్‌   

అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యత
సచివాలయం మొదటి బ్లాకు వద్ద రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర జాతీయ జెండా ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకం ఫలాలు సమాజంలోని ప్రతి వ్యక్తికి సక్రమంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. వివిధ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సక్రమంగా అమలు చేసేందుకు ప్రతి ప్రభుత్వ అధికారి, ఉద్యోగి మరింత కష్టించి పనిచేయాలని కోరారు. సచివాలయ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సీఎం క్యాంపు కార్యాలయంలో పతాకావిష్కరణ
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ జాతీయ జెండాను ఎగురవేశారు. జాతిపిత మహాత్మాగాంధీ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. సీఎం అదనపు కార్యదర్శులు కె.ధనుంజయరెడ్డి, జె.మురళీ, సీఎం వోఎస్‌డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, చీఫ్‌ సెక్యూరిటీ అధికారులు పరమేశ్వర్‌రెడ్డి, అమర్లపూడి జోషి పాల్గొన్నారు. 

విద్యుత్‌ రంగం బలోపేతం
విజయవాడ విద్యుత్‌ సౌధలో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. ఏటా 50 వేల వ్యవసాయ సర్వీసులను కొత్తగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 

రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో..
విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోగల రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం వద్ద పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ దేశం కోసం త్యాగాలు చేసిన వారి సేవలను కొనియాడారు. డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీ హనుమంతరావు, జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌సీఆర్‌ పి.ప్రతాప్‌రెడ్డి, మోడల్‌ స్కూల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ మధుసూదనరావు, డిప్యూటీ డైరెక్టర్‌ సుల్తానా పాల్గొన్నారు.

పీసీబీ కార్యాలయంలో..
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కార్యాలయంలో సభ్య కార్యదర్శి వివేక్‌యాదవ్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యుత్తమ సేవలే లక్ష్యంగా కొన్ని నియామకాలు చేపట్టనున్నామని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో పీసీబీ మూడేళ్లు వరుసగా మొదటి స్థానంలో నిలవడానికి సిబ్బంది ఉత్తమ పనితీరే కారణమని ప్రశంసించారు. చీఫ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరు శివప్రసాద్, సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజరు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు