రూ.10 వేల కోట్లతో హైవేల అభివృద్ధి

14 Apr, 2022 04:07 IST|Sakshi

1,586 కిలోమీటర్ల మేర హైవేలు, జంక్షన్ల అభివృద్ధికి కార్యాచరణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి వేగం పుంజుకుంటోంది. మరో 1,586 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. రాబోయే మూడేళ్లలో దశలవారీగా మొత్తం రూ.10 వేల కోట్లతో జాతీయ రహదారులను అభివృద్ధి చేయనున్నారు. ఈమేరకు ప్రతిపాదనలను జాతీయ రహదారులశాఖ ఖరారు చేసింది. గత వార్షిక ప్రణాళికలో మిగులు పనులతోపాటు రాష్ట్రంలో పోర్టులు, ప్రధాన పారిశ్రామిక పట్టణాలను అనుసంధానించే రహదారులను 12 మీటర్ల వెడల్పుతో (టూ లేన్స్‌ విత్‌ పావ్డ్‌ సోల్టర్స్‌)గా విస్తరించేందుకు మార్గం సుగమమైంది. సూత్రప్రాయంగా ఆమోదించిన ఈ ప్రణాళికలకు త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ రహదారుల నిర్మాణానికి ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు ఖరారు  చేశారు. త్వరలోనే టెండర్లు పిలిచి మూడేళ్లలో పనులు పూర్తిచేయనున్నారు. 

అభివృద్ధి చేయనున్న కొన్ని ప్రధాన రోడ్లు
కల్వకుర్తి–నంద్యాల 250 కిలోమీటర్లు, నంద్యాల–జమ్మలమడుగు 82 కి.మీ., డోన్‌–సోమయాజులపల్లి 78 కి.మీ., గోరంట్ల–హిందూపురం 50 కి.మీ., పెడన–హనుమాన్‌జంక్షన్‌ 51 కి.మీ., అమలాపురం–బొబ్బర్లంక 55 కి.మీ., ఆకివీడు–దిగుమర్రు 45 కి.మీ., నరసాపురం రింగ్‌రోడ్డు 40 కిలోమీటర్ల రహదారుల్ని అభివృద్ధి చేయనున్నారు. ఇవేగాక రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులతో అనుసంధానించే పలు రోడ్లను 12 మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు.  

మరిన్ని వార్తలు