రూ.150 కోట్లతో కృష్ణా కరకట్ట అభివృద్ధి

19 May, 2021 04:41 IST|Sakshi
పైలాన్‌ పనులను పరిశీలిస్తున్న ఇరిగేషన్‌ ఈఈ రాజ్‌ సంపత్‌ కుమార్, తదితరులు

రేపు సీఎం వైఎస్‌ జగన్‌ చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన

తాడేపల్లి రూరల్‌ (మంగళగిరి): కృష్ణా నది ఎగువ ప్రాంతంలోని ఉండవల్లి జీరో పాయింట్‌ నుంచి వైకుంఠపురం వరకు ఉన్న కరకట్టను మరింత పటిష్టం చేసి రహదారి నిర్మించేందుకు నీటిపారుదల శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికోసం ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. ఈ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి జీరో పాయింట్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్‌ పనులను ఇరిగేషన్‌ ఈఈ రాజ్‌ సంపత్‌ కుమార్‌ మంగళవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉండవల్లి – అమరావతి కరకట్ట వైకుంఠపురం వరకు 23 కిలోమీటర్ల పొడవు ఉందని, ఇందులో 15.25 కిలోమీటర్ల వరకు 10 మీటర్ల మేర వెడల్పు చేస్తున్నామని చెప్పారు. కాగా, ఈ రహదారి ప్రకాశం బ్యారేజీని కలపడంతోపాటు రాజధాని పరిధిలోని ఎన్‌ఎ–1 (ఉండవల్లి) నుంచి ఎన్‌ఎ–13 (ఉద్దండరాయుడిపాలెం) వరకు రోడ్డును కలుపుకుంటూ సచివాలయం వరకు వెళుతుంది.

అంతేకాకుండా కృష్ణానది మీద ఇబ్రహీంపట్నం –వెంకటపాలెం మధ్య నిర్మించనున్న ఐకాన్‌ బ్రిడ్జి, కాజ టోల్‌ గేట్‌ నుంచి వెంకటపాలెం వరకు నిర్మించనున్న రహదారికి కూడా ఇది అనుసంధానమయ్యేలా అధికారులు డిజైన్‌ చేశారు. 

మరిన్ని వార్తలు