సొంత నిధులతోనే రైల్వే స్టేషన్ల అభివృద్ధి

16 Feb, 2022 05:27 IST|Sakshi

కాంట్రాక్టర్ల నుంచి ఆశించిన స్పందన లేకపోవడంతో రైల్వే శాఖ నిర్ణయం

రాష్ట్రంలో విజయవాడ, నెల్లూరు, తిరుపతి స్టేషన్ల అభివృద్ధి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ–ప్రైవేట్‌ భాగస్వామ్యం(పీపీపీ) విధానంలో రాష్ట్రంలో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచినా.. ఆశించిన స్పందన రాకపోవడంతో సొంత నిధులతోనే పనులు చేపట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 50కుపైగా రైల్వే స్టేషన్లను పీపీపీ విధానం కింద ప్రైవేటు సంస్థలకు 90 ఏళ్ల పాటు అప్పగించాలని సూత్రప్రాయంగా గతంలో నిర్ణయించారు. ఆ జాబితాలో ఏపీలోని విజయవాడ, నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లు కూడా ఉన్నాయి.

రైల్వే స్టేషన్లలో మల్టీప్లెక్స్‌లు, మాల్స్, రెస్టారెంట్లు, పలు రకాల ఇండోర్‌ గేమ్స్‌ అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినప్పటికీ రైల్వే శాఖ పట్టించు కోలేదు. మొదటగా నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కానీ రైల్వే శాఖ ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. మొదటి రెండు అంతస్తులు రైల్వే శాఖకు అప్పగించి మిగిలిన అంతస్తుల్లో వాణిజ్య సముదాయాల నిర్వహణ లాభసాటి కాదని ప్రైవేటు సంస్థలు భావించాయి.

పైగా రైల్వే శాఖ కనీస బిడ్‌ ధర కూడా చాలా ఎక్కువుగా నిర్ణయించడంతోపాటు ఇతర షరతులు కూడా సానుకూలంగా లేవన్న అభిప్రాయం వ్యక్తమైంది. కొన్ని బడా కార్పొరేట్‌ సంస్థలతో రైల్వే శాఖ సంప్రదింపులు కూడా జరిపినా ఫలితం  దక్కలేదు. నగరాల్లో ప్రధాన కూడళ్లలో కాకుండా కొంచెం దూరంగా ఉండే రైల్వే స్టేషన్ల ప్రాంగణంలో షాపింగ్‌ మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం లాభసాటి కాదని కూడా ఆ ప్రైవేటు సంస్థలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దాంతో రైల్వే శాఖ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. రైల్వే స్టేషన్లను తమ నిధులతోనే అభివృద్ధి  చేయాలని నిర్ణయించింది. 

అభివృద్ధి ప్రణాళికకు ఆమోదం
రాష్ట్రంలోని నెల్లూరు, తిరుపతి రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ నిధులతోనే అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్రణాళికను తాజాగా ఆమోదించారు. దాదాపు రూ. 300 కోట్లతో వీటిని అభివృద్ధి చేయనున్నారు. ప్రైవేటు సంస్థలతో పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు గతంలో రూపొందించిన ప్రణాళిక దీనికి వర్తించదని కూడా రైల్వే శాఖ స్పష్టం చేసింది.

వాణిజ్య ప్రయోజనాల దృష్ట్యా కాకుండా ప్రయాణికులకు అధునాతన సౌకర్యాల కోణంలోనే రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. అందుకోసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను రూపొందించమని రైల్వే శాఖ దక్షిణ మధ్య రైల్వేను ఆదేశించింది. డీపీఆర్‌ ఖరారైన తరువాత రైల్వే స్టేషన్ల అభివృద్ధి ప్రణాళిక ఓ కొలిక్కి వస్తుందని రైల్వే శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.    

మరిన్ని వార్తలు