రూ.1,400 కోట్లతో ఆలయాల అభివృద్ధి

20 Dec, 2023 04:58 IST|Sakshi

రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ 

అన్నవరంలో రూ.25 కోట్లతో నిర్మించిన భవనాలు, రోడ్లు ప్రారంభం 

తొండంగి:  రాష్ట్రంలో రూ.1,400 కోట్లతో ముఖ్య దేవాలయాలను అభివృద్ధి చేశామని రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై రూ.25 కోట్లతో నిర్మించిన శివసదన్, యాత్రికుల విశ్రాంతి భవనాలు, ఘాట్‌ రోడ్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేవాలయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అన్నవరం కొండపై భక్తుల సౌకర్యాల కల్పనలో భాగంగా 138 గదులతో శివసదన్‌ నిర్మించినట్లు తెలిపారు.

శ్రీసత్యన్నారాయణ యాత్ర నివాస్, ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు సీఆర్వో కార్యాలయం వెనుక ఆదిశంకర మార్గ్, సత్యగిరి వైజంక్షన్‌ వద్ద హరిహర మార్గ్, వనదుర్గ మార్గ్‌లను పూర్తి చేసినట్లు చెప్పారు. రాజమహేంద్రవరానికి చెందిన దాత రాజామణి సుమారు రూ.2 కోట్లతో భక్తుల కోసం రత్నగిరి విశ్రాంతి భవనం నిర్మించడం అభినందనీయమన్నారు. వైకుంఠ ఏకా దశి నాడు శంఖు చక్రాలు ప్రారంభించాలని ఆలయ ఈవోకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

>
మరిన్ని వార్తలు