వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి

18 Sep, 2022 03:40 IST|Sakshi
మూడు రాజధానులు కావాలంటూ విశాఖలో ర్యాలీ చేస్తున్న విద్యార్థులు, ప్రజలు

అన్ని పార్టీలూ పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతివ్వాలి

ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను వ్యతిరేకిస్తే బుద్ధి చెబుతాం

విశాఖలో విద్యార్థుల భారీ ర్యాలీ

ఉత్తరాంధ్ర నాశనమవ్వాలని అరసవల్లి దేవుణ్ని కోరతారా? అంటూ ఆగ్రహం

టీడీపీ నాయకులు తీరు మార్చుకోవాలని హెచ్చరిక  

సీతమ్మధార(విశాఖ ఉత్తర): వికేంద్రీకరణతోనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని.. విశాఖను వెంటనే పరిపాలన రాజధాని చేయాలని విద్యార్థులు నినదించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే.. తగిన బుద్ధి చెబుతామని రాజకీయ పార్టీలను హెచ్చరించారు. ఉత్తరాంధ్ర నాశనమవ్వాలని అరసవల్లి దేవుణ్ని కోరతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పరిపాలన రాజధాని విశాఖకు మద్దతుగా శనివారం నగరంలో స్టూడెంట్‌ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్‌ జేఏసీ నాయకులు బి.కాంతారావు, టి.సురేష్‌కుమార్‌ మాట్లాడుతూ.. విశాఖపట్నం పరిపాలన రాజధాని కావడం వల్ల ఉత్తరాంధ్రకు పరిశ్రమలు వస్తాయన్నారు. ప్రజలు వలసలు పోవాల్సిన దుస్థితి తప్పుతుందన్నారు.

రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలూ విశాఖకు ఉన్నాయని చెప్పారు. గతంలో హైదరాబాద్‌ కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్ర విభజనప్పుడు నష్టపోయామనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. మరోసారి ప్రాంతీయ ఉద్యమాలు రాకుండా సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరారు.

అమరావతి యాత్ర పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర సమానాభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిచిన టీడీపీ ప్రజాప్రతినిధులు.. ఇక్కడి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఉత్తరాంధ్రలోని అన్ని పార్టీలు పరిపాలన రాజధానికి మద్దతు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు మారాలని లేకపోతే.. అమరావతి యాత్రను పాయకరావుపేట వద్ద అడ్డుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలో విద్యార్థి నాయకులు భరత్, హరీష్, బాలాజీ, జాని, వెంకటేష్, ఉదయ్, చందు, రాఘవ, వివేక్, జగదీష్, సన్నీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు