పల్లెకు సొబగులు.. ప్రజలకు వసతులు

10 Feb, 2021 04:35 IST|Sakshi
నాయుడుపేట మండలం కల్లిపేడు గ్రామ సచివాలయం

రూ.వేలకోట్లతో పంచాయతీల్లో అభివృద్ధి పనులు 

కాలనీల్లో రోడ్లు మొదలు స్కూళ్ల మరమ్మతుల వరకు..

నెల్లూరు జిల్లాలో మారుతున్న గ్రామాల రూపురేఖలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పల్లెలకు మహర్దశ పట్టింది. దశాబ్దాలుగా సమస్యలతో కునారిల్లుతున్న గ్రామాల్లో అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. సాధారణ రోడ్లు మొదలుకుని అధునాతన నిర్మాణాల వరకు అన్ని హంగులతో గ్రామాలు కొత్త శోభ సంతరించుకుంటున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనా పగ్గాలు చేపట్టిన ఏడాది, పదినెలల్లోనే పల్లెల్లో పెద్దఎత్తున అభివృద్ధి పనులు మొదలయ్యాయి. జిల్లాలో ఉన్న 941 పంచాయతీల్లో మొత్తం రూ.2,500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు వేగంగా నిర్మిస్తున్నారు. ఇళ్ల పట్టాలు అందజేశారు.

పక్కాగృహాల నిర్మాణాలకు చర్యలు తీసుకున్నారు. 24 గంటలు వైద్యసేవలందేలా ఆరోగ్య కేంద్రాలకు వసతులు సమకూరుతున్నాయి. సీసీ రోడ్లు, పక్కా రోడ్లు నిర్మిస్తున్నారు. రోడ్ల పనులకు సుమారు రూ.500 కోట్లు మంజూరయ్యాయి. మనబడి నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్‌ పాఠశాలల స్థాయికి మారుతున్నాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలతో కళావిహీనంగా ఉన్న పాఠ«శాలలు నేడు అందంగా కనిపిస్తున్నాయి. విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరందేలా ఏర్పాట్లు చేశారు. మంచి ఫర్నిచర్, ఆహ్లాదకరమైన పెయింటింగ్‌లతో స్కూళ్లు ఆకట్టుకుంటున్నాయి. 1,054 పాఠశాలల్లో మరుగుదొడ్ల మరమ్మతులు చేపట్టారు. ఇప్పటికే 519 పూర్తయ్యాయి.

40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తి
గ్రామ సచివాలయాలు ప్రజలకు విశేషంగా సేవలందిస్తున్నాయి. నూతన భవనాల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే 40 సచివాలయ భవనాల నిర్మాణం పూర్తయింది. బియ్యం కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు, కుల, నివాస, ఆదాయ తదితర పత్రాలను సచివాలయాల్లోనే వేగంగా అందజేస్తున్నారు. జిల్లాలో 660 రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటికి సొంత భవనాలు నిర్మిస్తున్నారు. స్థలం, అంతస్తులను బట్టి రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఒక్కో భవనానికి ఖర్చు చేస్తున్నారు. ఇందుకోసం దాదాపు రూ.198 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఈ  కేంద్రాల ద్వారా ఎరువులు, పురుగుమందులు తక్కువ ధరకే అందేలా చూస్తున్నారు. వాటిద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ–క్రాప్‌ వివరాలను అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. జిల్లాలో 75 పీహెచ్‌సీలుండగా వాటికి అనుబంధంగా పల్లెల్లో 556 హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక స్టాఫ్‌ నర్సు ఉండేలా చూసి 24 గంటలు వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు వరకు వెచ్చిస్తున్నారు.
మర్రిపాడు మండలం డీసీపల్లిలోని రైతుభరోసా కేంద్రం 

53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం
జిల్లాలో 53 వేల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఇంటిస్థలం పట్టాలు పంపిణీ చేశారు. టిడ్కో ఇళ్లను అందజేశారు. చక్కటి లే అవుట్లలో రూపుదిద్దుకుంటున్న కాలనీల్లో అన్ని వసతులు కల్పిస్తున్నారు. పలు పల్లెలకు ప్రధాన రహదారులను కలుపుతూ లింకు రోడ్లు నిర్మిస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు రూ.500 కోట్ల వరకు పంచాయతీరాజ్‌ రోడ్లు మంజూరు చేశారు. ఇలా అన్ని రంగాల్లో గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.  

మరిన్ని వార్తలు