ప్రగతిపథంలో 'పురం'

3 Mar, 2021 05:08 IST|Sakshi
పోణంగిలో వైఎస్సార్‌ జగనన్న కాలనీ లేఅవుట్‌ (ఫైల్‌)

పశ్చిమగోదావరి జిల్లాలో రూ. కోట్లతో అభివృద్ధి పనులు

వేలాదిమందికి ఇళ్లస్థలాలు

ఒక్క ఏలూరులోనే 35 వేల మందికి స్థలాలు, ఇళ్లు

అభివృద్ధి వైపే పురప్రజల మొగ్గు

సాక్షి ప్రతినిధి, ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో నగర, పట్టణ ప్రాంతాలు అభివృద్ధిపథంలో నడుస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలూరు నగరపాలక సంస్థతోపాటు పట్టణాల్లో కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయి. అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. జిల్లాలోని మున్సిపాలిటీల్లో సుమారు 60 వేలమందికి ఇళ్ల స్థలాలు, టిడ్కో ఇళ్లు ఇవ్వనున్నారు. ఒక్క ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 29 వేలమందికి ఇళ్ల పట్టాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇవికాకుండా 6,480 టిడ్కో ఇళ్లను త్వరలో ఇవ్వనున్నారు. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తోపాటు నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలంతా అభివృద్ది, సంక్షేమం వైపే మొగ్గుచూపిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీల్లోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. చాలాచోట్ల పోటీచేసేందుకు అభ్యర్థులు లేక విపక్షాలు నిరాశలో ఉన్నాయి. నరసాపురంతో పాటు ఇతర మున్సిపాలిటీల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ చీకటిపొత్తులకు తెరతీస్తున్నాయి.

నరసాపురంలో..
14వ ఆర్థికసంఘం నిధులు, జనరల్‌ ఫండ్స్‌ నుంచి మొత్తం రూ.13 కోట్లతో 31 వార్డుల్లో రోడ్లు, డ్రెయిన్లు నిర్మించారు. రూ.8 కోట్లతో చేపట్టనున్న రహదారులు, మంచినీటి పైప్‌లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రూ.28 కోట్లు వెచ్చించి 50 పడకల ప్రభుత్వాస్పత్రిని 100 పడకలకు పెంచుతున్నారు. దీన్లో రూ.13 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయి. రూ.3 కోట్లతో బస్టాండ్‌ ఆధునికీకరణకు పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. రూ.400 కోట్లతో వశిష్ట నదిపై వంతెన నిర్మాణానికి డీపీఆర్‌ రూపొందించారు. స్థల సేకరణకు ప్రభుత్వం రూ.65 కోట్లు మంజూరు చేసింది. 

నిడదవోలులో..
2,705 మందికి ఇళ్ల స్థలాలు ఇస్తుండగా, 1,248 మందికి టిడ్కో గృహాలు కేటాయించనున్నారు. నాడు–నేడు కింద 8 పాఠశాలల్లో రూ.2.08 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.6.24 కోట్లతో 55 సీసీ రోడ్లు, డ్రైయిన్ల పనులు కొనసాగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద రూ.97.06 లక్షలతో 8 పనులు చేపట్టారు. పురపాలకసంఘం సాధారణ నిధులు రూ.3.5 కోట్లతో సీసీ రోడ్లు,  డ్రైన్లు పనులు జరుగుతుండగా, పట్టణంలో నూతన జగనన్న కాలనీలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మాణానికి రూ.89.58 లక్షలు మంజూరయ్యాయి. 

జంగారెడ్డిగూడెంలో..
ఇప్పటివరకు రూ.6 కోట్లతో సీసీరోడ్లు, డ్రెయిన్ల పనులు పూర్తికాగా మరో రూ.3 కోట్ల పనులు జరుగుతున్నాయి. వీటికి 14వ ఆర్థికసంఘం నిధులు, ఎస్‌ఎఫ్‌సీ నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వెచ్చించారు. పట్టణంలో 2,266 మందికి ఇళ్లస్థలాల పట్టాలు ఇచ్చారు. 588 మందికి టిడ్కో ఇళ్లు పంపిణీ చేశారు. 231 ఇళ్లను త్వరలో పంపిణీ చేయనున్నారు.

కొవ్వూరులో..
నాడు–నేడు పథకం కింద రూ.40 లక్షలు వెచ్చించి పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. రూ.2 కోట్లతో డ్రెయిన్ల నిర్మాణం చేపట్టారు. రూ.4 కోట్లతో శ్రీనివాసపురం అవుట్‌ఫాల్‌ డ్రెయిన్‌ పనులు జరుగుతున్నాయి. గోదావరి నీటిని శుద్ధిచేసే ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రపంచబ్యాంకు నిధులు రూ.53 కోట్లు మంజూరయ్యాయి. పట్టణంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 15వ ఆర్థికసంఘం నిధులు రూ.1.78 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద రూ.45 లక్షలు వచ్చాయి.

రూ.వందల కోట్లతో పనులు
ఏలూరు నగరంలో రూ.200 కోట్లతో సుమారు 573 ఎకరాల స్థలం సేకరించి 29 వేలమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. 14వ ఆర్థికసంఘం నిధులు రూ.44 కోట్లతో 142 అభివృద్ధి పనులు, 15వ ఆర్థికసంఘం నిధులు రూ.22 కోట్లతో 20 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ.8 కోట్లతో నగరంలోని 14 పాఠశాలలను నాడు–నేడు కింద అభివృద్ధి చేస్తున్నారు. రూ.59.80 కోట్లతో 281 సీసీ రోడ్లు, రూ.52.75 కోట్లతో 188 సీసీ డ్రైన్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. నగరంలో నిర్మించే వైద్యకళాశాల కోసం 54 ఎకరాల స్థలాన్ని సేకరించారు. నగరపాలక సంస్థలో మొత్తం 2,47,631 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళలు 1,27,890 మంది, పురుషులు 1,19,741 మంది. 

మరిన్ని వార్తలు