శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

22 May, 2022 05:37 IST|Sakshi

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమల: శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తి వస్తున్నారు. వేసవి సెలవులు, వారాంతాలు కావడంతో సప్తగిరులపై ఊహించని రీతిలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1, 2లోని 31 కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోగా.. 3 కిలోమీటర్ల మేర భక్తులు వేచి ఉన్నారు. మరోవైపు నడక మార్గం గుండా  అధిక సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేసింది.

ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 నుంచి 3 గంటలు పడుతుండగా.. సర్వదర్శనం దాదాపుగా 24 గంటలు పడుతోంది. స్వామి వారిని శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,119 మంది దర్శించుకున్నారు. 37,256 మంది తలనీలాలు సమర్పించారు.

హుండీలో రూ.3.91 కోట్లు సమర్పించారు. కాగా, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను టీటీడీ శనివారం ఉదయం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. రెండు నెలలకు కలిపి దాదాపు 13,35,000 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల చేయగా.. దాదాపు 2లక్షల 78వేల టికెట్లను భక్తులు బుక్‌ చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు