కర్నూలు ఎయిర్‌పోర్టుకు డీజీసీఏ అనుమతులు

17 Jan, 2021 05:16 IST|Sakshi

త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం 

మంత్రి గౌతమ్‌రెడ్డి వెల్లడి

సాక్షి, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్‌ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించేందుకు కీలకమైన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) అనుమతులొచ్చాయి. విమాన సర్వీసులు ప్రారంభించడానికి అనుమతిస్తూ జనవరి 15న డీజీసీఏ ఉత్తర్వులిచ్చినట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. ఓర్వకల్లు విమానాశ్రయంపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు, వేగంగా నిధులు మంజూరు చేయడంతో స్వల్ప కాలంలోనే కీలకమైన అనుమతులు పొందగలిగినట్టు ఆయన తెలిపారు.

గతేడాదే విమానాశ్రయ అభివృద్ధికి రూ.150 కోట్లు ఖర్చు చేయడం సీఎం వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో కర్నూలు జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి మరింత పరుగులు పెట్టడంతో పాటు, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఎయిరొడ్రోమ్‌ లైసెన్స్‌తో పాటు, ఇతర అనుమతులు తీసుకురావడంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఏపీఏడీసీ ఎండీ వీఎన్‌ భరత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవన్‌ కృషిని మంత్రి గౌతమ్‌రెడ్డి కొనియాడారు.

డీజీసీఏ జారీ చేసిన అనుమతి పత్రం 

మరిన్ని వార్తలు