మహిళల భద్రత మా బాధ్యత

7 Jan, 2021 04:20 IST|Sakshi
డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, ఆమె తండ్రి సీఐ శ్యాంసుందర్‌లను సత్కరిస్తున్న డీజీపీ

‘దిశ’తో మహిళలకు సత్వర న్యాయం

ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో డీజీపీ 

‘మహిళా భద్రత’పై పద్మావతి వర్సిటీతో ఒప్పందం  

తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: మహిళల భద్రత తమ బాధ్యతని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ‘దిశ’తో మహిళలకు సత్వర న్యాయం జరుగుతోందని చెప్పారు. ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌లో భాగంగా ‘మహిళల భద్రత’ ప్రధాన అంశంగా బుధవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ దువ్వూరి జమునతో మహిళా భద్రతకు సంబంధించి అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకున్నారు. డీజీపీ సవాంగ్‌ మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతున్న నేరాలను నిరోధించడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. మహిళల భద్రతకు సీఎం వైఎస్‌ జగన్‌ అనేక చర్యలు చేపడుతున్నారని వివరించారు. ముఖ్యమంత్రి చొరవ వల్లే ఆరేళ్లుగా నిర్వహించలేకపోయిన ఏపీ పోలీస్‌ డ్యూటీ మీట్‌ను ఇప్పుడు విజయవంతంగా జరుపుకుంటున్నామన్నారు.

మహిళలకు సత్వర న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ఆమోదించిందని గుర్తు చేశారు. గతంలో మహిళలపై జరిగిన నేరాల్లో 200 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేస్తే.. ఇప్పుడు చాలా తక్కువ రోజుల్లోనే చార్జిషీటు కూడా వేయగలుగుతున్నామన్నారు. దిశ పోలీస్‌స్టేషన్లు తదితర చర్యల ద్వారా మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కాగా, రామతీర్థం ఘటనపై పలు ఆధారాలు లభించాయని డీజీపీ చెప్పారు. నిందితులను త్వరగా పట్టుకుంటామన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలిపారు. ఇప్పటికే పలువురు దుండగులను అరెస్టు చేసినట్టు చెప్పారు. వీటి వెనుక ఏమైనా కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఏఆర్‌ అనురాధ, దిశ ప్రత్యేక అధికారి దీపికా పాటిల్, పోలీస్‌ వెల్ఫేర్‌ అదనపు డీజీ శ్రీధర్‌రావు, సీఐడీ ఎస్పీ జీఆర్‌ రాధిక తదితరులు మాట్లాడారు.

వెల్‌డన్‌ ఫాదర్‌.. శభాష్‌ డాటర్‌ 
‘వెల్‌డన్‌ ఫాదర్‌.. శభాష్‌ డాటర్‌’ అంటూ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి, సీఐ శ్యామ్‌సుందర్‌ను డీజీపీ సవాంగ్‌ అభినందించారు. వారిద్దరికీ ప్రజలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా తిరుపతిలో జరుగుతున్న పోలీసు డ్యూటీ మీట్‌లో తండ్రీ, కూతురును డీజీపీ అభినందించారు. యాక్సిస్‌ బ్యాంక్‌ ప్రతినిధుల ఆధ్వర్యంలో వారిద్దరికీ డీజీపీ ఆత్మీయ సన్మానం చేశారు. సీఐ శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ.. తన కుమార్తెతో కలిసి విధులు నిర్వర్తిస్తానని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. ప్రజలకు సేవ చేసే పోలీసు శాఖను ఆమె  ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పోలీసు విభాగంలో చేరేలా కుమార్తెలను కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు. 

మరిన్ని వార్తలు