వినాయక ఉత్సవాలపై ఎలాంటి ఆంక్షలు లేవు 

29 Aug, 2022 03:22 IST|Sakshi

డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినాయక చవితి నిర్వహణ పైన, వినాయక విగ్రహాల నిమజ్జనం పైన ఎటువంటి ఆంక్షలు లేవని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాది పోలీసులు కొత్తగా ఆంక్షలు విధిస్తున్నారంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ విశ్వసించవద్దని చెప్పారు. ప్రజలు ఎప్పటిలా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు పోలీసు శాఖ పూర్తిగా సహకరిస్తుందని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వినాయక ఉత్సవ కమిటీలు స్థానికంగా పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.

వినాయక ఉత్సవాల నిర్వాహకులు ఎటువంటి అఫిడవిట్లు సమర్పించాల్సిన అవసరం లేదని డీజీపీ స్పష్టం చేశారు. వినాయక ఉత్సవాల నిర్వహణ కమిటీలకు పూర్తిగా సహకరించాలని ఎస్పీలు, డీఐజీలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. ఏటా మాదిరిగానే వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీసు శాఖ ఈ ఏడాది కూడా సూచనలు చేస్తోందన్నారు.   

ఈ జాగ్రత్తలు పాటించండి 
► వినాయక మండపాల ఏర్పాటుపై ఉత్సవ కమిటీలు సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలి. 
► విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవాలు నిర్వహించే రోజులు, నిమజ్జనానికి ఉపయోగించే వాహనం, నిమజ్జనం కోసం తీసుకువెళ్లే రూట్‌ వివరాలను స్థానిక పోలీసులకు తెలపాలి.  
► అగ్నిమాపక, విద్యుత్తు శాఖ సూచనల మేరకు వినాయక మండపాల వద్ద ముందుజాగ్రత్త చర్యగా తగినంత ఇసుక, నీళ్లు ఏర్పాటు చేయాలి. 
► కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారమే వినాయక మండపాల వద్ద స్పీకర్లు ఏర్పాటు చేయాలి. ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకే స్పీకర్లను ఉపయోగించాలి. 
► మండపాల వద్ద క్యూలైన్ల నిర్వహణ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు పోలీసు శాఖకు సంబంధిత కమిటీలు సహకరించాలి. 
► మండపాల వద్ద ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలి. నిర్వాహక కమిటీ సభ్యులు రాత్రివేళల్లో మండపాల వద్ద తప్పనిసరిగా కాపలా ఉండాలి.  
► విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం వేషధారణలు, డీజే వంటి వాటిపై స్థానిక పోలీసులకు ముందుగా సమాచారం అందించాలి. 
► ఇంతకుమించి ఎవరైనా ఇతర నిబంధనలు విధిస్తే అదనపు డీజీ (శాంతి భద్రతలు) రవిశంకర్‌ అయ్యన్నార్‌ (ఫోన్‌: 99080–17338), డీఐజీ రాజశేఖర్‌బాబు (ఫోన్‌: 80081–11070) దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.    

మరిన్ని వార్తలు