రాష్ట్రంలో గంజాయికి అడ్డుకట్ట

16 Nov, 2022 03:45 IST|Sakshi
మాట్లాడుతున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకూ గట్టి చర్యలు 

త్వరలో తిరుపతిలో పక్క రాష్ట్రాలతో సమన్వయ సమావేశం 

రాష్ట్రంలో 1.32 లక్షల కిలోల గంజాయి స్వాధీనం.. 1,599 కేసులు 

ఏడాదిలోగా 6,500 సిబ్బంది నియామకానికి అవకాశం 

ఎస్పీ, సీపీలకు కేసుల విచారణ బాధ్యత.. దోషులకు వేగంగా శిక్షలు 

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి

దొండపర్తి (విశాఖ దక్షిణ):  రాష్ట్రంలో గంజాయి, ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగా త్వరలోనే పొరుగు రాష్ట్రాల అధికారులతో తిరుపతిలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గంజాయి కట్టడిపై పోలీస్‌ శాఖ పూర్తిస్థాయిలో దృష్టి సారించిందని చెప్పారు.

ఈ ఏడాది 1.32 లక్షల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, 1,599 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణా కేసుల్లో నిందితులు 12 రాష్ట్రాలకు చెందిన వారని, వారందరినీ త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. సైబర్‌ కేసులను ఛేదించడానికి అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఏడాదిలోగా 6,500 మంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

లోక్‌ అదాలత్‌ ద్వారా 47 వేల కేసులు పరిష్కారం 
రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌ అదాలత్‌ ద్వారా 47 వేల కేసులు పరిష్కారమయ్యాయని, వీటిలో పెండింగ్‌తో పాటు విచారణలో ఉన్న 36 వేలు ఐపీసీ కేసులు ఉన్నాయన్నారు. లక్ష వరకు పెట్టీ కేసులను కూడా పరిష్కరించినట్లు చెప్పారు. న్యాయ వ్యవస్థతో సమన్వయం చేస్తూ ఒకే లోక్‌ అదాలత్‌లో ఇంత పెద్ద సంఖ్యలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్రంలోని పోలీస్‌ అధికారులను, సిబ్బందిని అభినందించారు. 

దోషులకు సత్వరమే శిక్ష పడేలా సమగ్ర విచారణ 
దోషులకు సత్వరమే శిక్ష పడేలా నేర నిరూపణలో వేగవంతమైన, సమగ్ర దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం స్వయంగా ఎస్పీలే నాలుగైదు పెండింగ్‌ కేసులు పర్యవేక్షించేలా ఆదేశించామని, దీని వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా విశాఖ నగర  పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీకాంత్‌ పర్యవేక్షణలో దిశ స్టేషన్‌లో నమోదైన మైనర్‌ బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి 20 ఏళ్లు శిక్ష పడేలా చేశారని తెలిపారు.

ఇదే తరహాలో రాష్ట్రంలో మరో రెండు నెలల్లో 120 కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖలో ప్రధాని మోదీ పర్యటన విజయవంతానికి కృషి చేసిన పోలీస్‌ అధికారులు, సిబ్బందిని డీజీపీ అభినందించారు. విశాఖలో నేరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. హత్యలు, అత్యాచారాలు, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని వివరించారు. ఈ సమావేశంలో, విశాఖ డీఐజీ హరికృష్ణ, విశాఖ నగర సీపీ సీహెచ్‌ శ్రీకాంత్, డీసీపీ (లా అండ్‌ ఆర్డర్‌) సుమిత్‌ సునీల్‌ గరుడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు