కొత్త జిల్లాలకు సరిపడా సిబ్బంది 

1 Mar, 2022 05:53 IST|Sakshi

గ్రామస్థాయిలో సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరం 

రాష్ట్రంలో సైబర్‌ నేరాలు తగ్గాయి 

కరోనాతో నిలిచిపోయిన పోలీసుల వీక్లీ ఆఫ్‌ మళ్లీ అమలు చేస్తాం 

విశాఖలో మీడియాతో డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  రాష్ట్రంలో కొత్త జిల్లాలకు సరిపడా పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే రాష్ట్రానికి  కేంద్రం ఐపీఎస్‌లను కేటాయించిందని, అందువల్ల కొత్త జిల్లాలకు వారి కొరత ఉండదని విశాఖలో సోమవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పారు. రాష్ట్రంలో గ్రామ పోలీసు చట్టం బ్రిటీష్‌ కాలం నుంచీ అమలులో ఉందని.. గ్రామస్థాయిలో పోలీసు విజిలెన్స్‌ కోసం సచివాలయ పోలీసు వ్యవస్థ అవసరమని డీజీపీ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్‌ నేరాల సంఖ్య గణనీయంగా తగ్గాయని తెలిపారు. వైఎస్‌ వివేకా ఘటనపై సీబీఐ దర్యాప్తు జరుగుతోందని.. ఈ సమయంలో దీనిపై మాట్లాడటం సరికాదని విలేకరుల ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.  

ఒడిశాతో కలిసి గంజాయి కట్టడి 
ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంజాయి సాగవుతోందని.. దీనిని కట్టడి చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. గంజాయి సాగు, సరఫరా నియంత్రణ కోసం ఒడిశాతో కలిసి పనిచేస్తున్నామన్నారు. నిజానికి గంజాయి సాగు మొదటినుంచీ ఉందని.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో దానిని కట్టడి చేసేందుకు  ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా కాలేజీలు, రిసార్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. దిశ యాప్‌ మహిళల రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ (పీఎఫ్‌ఆర్‌), మిలాన్‌–2022ను విజయవంతంగా నిర్వహించిన పోలీసులను డీజీపీ అభినందించారు. కరోనా కారణంగా నిలిచిపోయిన పోలీసుల వీక్లీ ఆఫ్‌లను తిరిగి అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. సమావేశంలో విశాఖ సిటీ పోలీస్‌ కమిషనర్‌ మనీష్‌కుమార్‌ సిన్హా కూడా పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు