నిబద్ధతతో పనిచేస్తున్న పోలీసులపై విమర్శలా? 

14 Aug, 2020 08:55 IST|Sakshi

ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరుపై డీజీపీ సవాంగ్‌ అభ్యంతరం 

సాక్షి, అమరావతి: నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న రాష్ట్ర పోలీసులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేయడం సమంజసం కాదని డీజీపీ గౌతం సవాంగ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్ర పోలీసులు ప్రజలకు విశేష సేవలందిస్తూ.. అన్ని వర్గాలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తున్నారని గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. అందులో డీజీపీ పేర్కొన్న అంశాలిలా ఉన్నాయి.. 
►2017లో 49.3 శాతం మందికి శిక్షలు పడగా.. 2020లో 64 శాతం మందికి శిక్షలు పడేలా చేయడం ప్రభుత్వ, పోలీసుల చిత్తశుద్ధికి నిదర్శనం.  
►కృష్ణా జిల్లా గొల్లపూడిలో బాలికపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి మరణశిక్ష పడిన సంగతి అందరికీ తెలిసిందే. 
►గుంటూరు జిల్లా గిరిజన మహిళలపై దాడి, కర్నూలు జిల్లాలో మహిళపై దాడి, రాజమండ్రిలో బాలికపై అత్యాచారం.. ఇలా అన్ని కేసుల్లోనూ పోలీసులు వేగంగా స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకున్నారు.  (34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ‌)

►తూర్పుగోదావరి జిల్లాలో శిరోముండనం కేసు, ప్రకాశం జిల్లా చీరాల కేసుల్లో సంబంధిత ఎస్సైలపై శాఖాపరమైన చర్యలతో పాటు అట్రాసిటీ కేసుల కింద అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దళితునిపై దాడి కేసులో సీఐపై చర్యలు తీసుకున్నాం.  
►మన పోలీసులకు జాతీయస్థాయిలో అవార్డులు, ప్రశంసలు లభిస్తున్నా అసత్య ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి.  
►అంతకుముందు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో డీజీపీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ కేసులో విచారణ జరుగుతోందని.. నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. కరోనా నేపథ్యంలో కేంద్రం మార్గదర్శకాల ప్రకారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు