తిరుమల: భక్తులకు శ్రీవారి ధన ప్రసాదం

2 Sep, 2021 07:16 IST|Sakshi
ధన ప్రసాదం ప్యాకెట్‌

తిరుమల: భక్తులు శ్రీవారికి సమర్పిస్తోన్న చిల్లర నాణేలను తిరిగి భక్తులకే ధన ప్రసాదంగా అందించే వినూత్న ప్రయోగాన్ని టీటీడీ చేపట్టింది. ప్రస్తుతం కరెంట్‌ బుకింగ్‌లో రూ.500 గదులు పొందే భక్తులు కాషన్‌ డిపాజిట్‌గా రూ.500 అదనంగా చెల్లిస్తున్నారు. గదులు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు భక్తులకు ఆ మొత్తాన్ని టీటీడీ తిరిగి చెల్లిస్తుంది. ఈ కాషన్‌ డిపాజిట్‌ను ధన ప్రసాదం రూపంలో చెల్లించే విధానాన్ని బుధవారం నుంచి టీటీడీ చేపట్టింది. ధన ప్రసాదంలో పసుపు, కుంకుమతోపాటు నాణేల ప్యాకెట్‌ను భక్తులకు అందజేస్తోంది. భక్తులు చిల్లర నాణేలను తీసుకునేందుకు ఆసక్తి చూపకపోతే నోట్ల రూపంలో కాషన్‌ డిపాజిట్‌ను తిరిగి ఇస్తోంది. ప్రస్తుతం రూ.2.5 కోట్ల మేరకు నాణేలు టీటీడీ వద్ద పేరుకుపోయాయి. వాటిని ధన ప్రసాదం రూపేణా భక్తులకు టీటీడీ అందిస్తోంది.

ఆ ఆరోపణలన్నీ అవాస్తవం : టీటీడీ
హిందూ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా టీటీడీ నిర్ణయాలు తీసుకుంటుందని టీటీడీ పీఆర్వో బుధవారం తెలిపారు. ఇటీవల కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారని, అదంతా అవాస్తవమని పేర్కొన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌ హోటల్‌ను, బెంగళూరులోని ఒక సంస్థకు కేటాయించడానికి టీటీడీ అధికారులు చర్యలు చేపట్టినట్లు నిరాధారమైన చౌకబారు ఆరోపణలు చేశారని చెప్పారు. అన్నమయ్య భవన్‌ హోటల్‌తో పాటు తిరుమలలోని అన్ని హోటళ్ల నుంచి బకాయిలను రాబట్టడానికి టీటీడీ చర్యలు చేపట్టిందని చెప్పారు. అసత్య వార్తలు ప్రచురించే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:
Andhra Pradesh: సిరి ధాన్యాలపై గురి  
మహానేత వైఎస్సార్‌: నిలువెత్తు సంక్షేమ రూపం 

మరిన్ని వార్తలు