సానుకూల అంశాలు ఉంటేనే పరిగణనలోకి.. 

15 Feb, 2022 05:25 IST|Sakshi

జిల్లాల ఏర్పాటుపై డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌  

నర్సీపట్నం(విశాఖపట్నం): కొత్త జిల్లాల ఏర్పాటులో సానుకూలమైన అంశాలు ఉంటేనే  సవరణలకు పరిగణనలోకి తీసుకుంటామని రాష్ట్ర డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు.  సోమవారం నర్సీపట్నం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనుభవజ్ఞునిలా పాలన చేస్తున్నారని,  పరిపాలన సౌలభ్యం కోసం 26 జిల్లాలను చేశారన్నారు. చరిత్ర కలిగిన ప్రాంతాలకు అల్లూరి సీతారామరాజు, ఎన్టీ రామారావు, శ్రీ సత్యసాయి పేర్లుగా నామకరణం చేశారని తెలిపారు.

సీఎంకు రాష్ట్ర భౌగోళిక  పరిస్థితులపై సమగ్రమైన అవగాహన ఉందన్నారు. జలయజ్ఞం ద్వారా తీసుకొచ్చిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సీఎం ప్రాధాన్యమిస్తూ.. అన్ని ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్నారని వివరించారు.  మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సీఎం సానూకూలంగా పరిష్కరించారని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించాలన్నారు.

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బతికి ఉండి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేదికాదన్నారు. ప్రత్యేకహోదా సాధనకు సీఎం కృషి చేస్తున్నా.. కేంద్రం నుంచి సానుకూలత రావడం లేదన్నారు. పాదయాత్రలో పేదల కష్టాలు తెలుసుకున్నందునే  నవరత్నాలకు రూపకల్పన చేశారని చెప్పారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న  2 లక్షల ఎకరాలకు సాగు పట్టాలతో పాటు.. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి..వారిపై తనకున్న ప్రేమను సీఎం జగన్‌ చాటుకున్నారని చెప్పారు.

మరిన్ని వార్తలు