నిర్మిస్తున్నవి ఇళ్లు కాదు.. ఊళ్లు

15 Jul, 2021 11:01 IST|Sakshi
సమీక్షలో పాల్గొన్న మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శ్రీరంగనాథరాజు, విశ్వరూప్, వేణు, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి

జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌

నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పై విస్తృత సమీక్ష

పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

సాక్షి, కాకినాడ సిటీ: గతంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా కాలనీలు కాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యాన రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా పెద్ద ఎత్తున గ్రామాల నిర్మాణమే జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంపై జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులతో జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి విస్తృత సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇళ్ల పట్టాలు అందజేయడం, ఇళ్ల మంజూరు నిరంతర ప్రక్రియని, అర్హులు దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో పట్టా మంజూరవుతుందని చెప్పారు. అధికారులు ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో ఎలాంటి భూ వివాదాలూ రాకుండా స్వచ్ఛమైన భూ రికార్డులే లక్ష్యంగా భూముల రీ సర్వేను ప్రారంభించామని అన్నారు. దీనిని రూ.వెయ్యి కోట్లతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టామని ధర్మాన తెలిపారు.

జిల్లాలో 4 లక్షల ఇళ్ల నిర్మాణం 
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలోనే అత్యధిక జనాభా కలిగిన తూర్పు గోదావరి జిల్లాలోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. 90 రోజుల్లో ఇంటి పట్టా కార్యక్రమంతో కలిపి, జిల్లాలో దశల వారీగా 4 లక్షల ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ప్రతి 20 ఇళ్లకు ఓ అధికారిని, అలాగే ప్రతి లే అవుట్‌కు మండల స్థాయి అధికారిని నోడల్‌ అధికారులుగా నియమించామని చెప్పారు. భౌగోళికంగా ఎంతో వైవిధ్యం ఉన్న జిల్లాలో సవాళ్లను అధిగమిస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఈ కార్యక్రమం అమలులో ముందుండేలా కృషి చేస్తున్నారని అభినందించారు.

కొమరిగిరి లే అవుట్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్‌ లైన్ల వంటి వాటి ఏర్పాటుతో భవిష్యత్తులో ఓ ఆదర్శ పట్టణం సాక్షాత్కరించనుందని అన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఎలాంటి ఆటంకం లేకుండా లే అవుట్లలోనే సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రిని రాయితీతో అందుబాటులో ఉంచనున్నామని మంత్రి తెలిపారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం స్పెషల్‌ లైన్‌ ద్వారా ఇసుకను లే అవుట్లకు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ మాట్లాడుతూ, అమలాపురం డివిజన్‌లో లోతు ఆధారంగా లే అవుట్లలో లెవెలింగ్‌ కార్యకలాపాలు సాగించాల్సి ఉందని సూచించారు. దీనివల్ల భవిష్యత్తులో సమస్యలు తలెత్తవన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చేపట్టిన పేదలందరికీ ఇళ్లు యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు సమష్టిగా కృషి చేయాలని అన్నారు. సమావేశంలో కాకినాడ ఎంపీ వంగా గీత, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్‌గుప్తా, సీఈ పి.శ్రీరాములు, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కొండేటి చిట్టిబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, పెండెం దొరబాబు, జాయింట్‌ కలెక్టర్లు జి.లక్ష్మీశ, ఎ.భార్గవతేజ, జి.రాజకుమారి, డీఆర్‌ఓ సీహెచ్‌ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ ఎన్‌వీవీ సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ పీడీ జి.వీరేశ్వర ప్రసాద్, మున్సిపల్‌ కమిషనర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీఓలు, వివిధ శాఖల ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు.
రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి
పేదలందరికీ ఇళ్ల నిర్మాణాలు పూర్తయితే దాదాపు రూ.4 లక్షల కోట్ల సంపద సృష్టి జరుగుతుందని మంత్రులు ధర్మాన కృష్ణదాస్, శ్రీరంగనాథరాజు అన్నారు. సమావేశం అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్రంలో రూ.12 వేల కోట్లతో భూసేకరణ చేసి, లే అవుట్లను సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలో 13 వేల గ్రామ పంచాయతీలుంటే వీటికి అనుబంధంగా మరో 17,500 కొత్త గ్రామాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. సముద్ర తీర గ్రామాల్లో తుపానులను సైతం ఎదుర్కొనేలా ఇళ్లు నిర్మిస్తున్నామని, ఆయా ప్రాంతాల్లోని లే అవుట్లలో భూగర్భ డ్రైనేజీలు, విద్యుత్‌ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32 వేల కోట్లు కేటాయించామని వివరించారు. ఇంటి నిర్మాణం పూర్తయితే ఒక్కో లబ్ధిదారుకు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల ఆస్తి సమకూరుతుందన్నారు. 

తొలి దశలో 1,34,458 ఇళ్లు  
‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమం స్థితిగతులను కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి వివరించారు. తొలిదశలో రూ.2,420 కోట్లతో 758 లే అవుట్లలో 1,34,458 ఇళ్ల నిర్మాణాలు చేపట్టామని వెల్లడించారు. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన నీటి సరఫరా పనులు 60 శాతం పూర్తయ్యాయని, 758 లే అవుట్లకు గానూ 673 లే అవుట్లకు విద్యుత్‌ సర్వీసులు మంజూరు చేశామని తెలిపారు. లే అవుట్లలో శాశ్వత మౌలిక వసతుల అభివృద్ధికి శాఖల వారీగా సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సిద్ధం చేశామని చెప్పారు. జియోట్యాగింగ్, మ్యాపింగ్, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్, జాబ్‌కార్డు మ్యాపింగ్, మెగా గ్రౌండింగ్‌ మేళా, ఇళ్ల నిర్మాణ సామగ్రి సేకరణ లక్ష్యాలను చేరుకునేందుకు లే అవుట్లను ఎ, బి, సి కేటగిరీలుగా వర్గీకరించామన్నారు. స్వయంసహాయ సంఘాలకు అడ్వాన్స్‌ రుణాల గురించి కలెక్టర్‌ వివరించారు.  

మరిన్ని వార్తలు